రైస్‌మిల్లులపై అధికారుల దాడులు
కరీంనగర్/హుజురాబాద్: హుజూరాబాద్‌లోని రైస్‌మిల్లులపై పౌరసరఫరాల శాఖ అధికారుల దాడులు నిర్వహించారు. రేషన్ బియ్యం నిల్వలు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు మిల్లులను తనిఖీ చేయాలని జాయింట్ కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. ఇందులో భాగంగా పట్టణంలోని శోభా రైస్‌మిల్లుపై పెద్దపల్లి, భీమదేవరపల్లి, హుస్నాబాద్ డిప్యూటీ తహసీల్థార్లు రమేశ్, మధుసూదన్‌రెడ్డి, రాజేశం, డీటీ ఎలమంద, ఇప్పలనర్సింగాపూర్ రోడ్‌లోని అశ్విని రైస్‌మిల్లును స్థానిక తహసీల్ధార్ రవి, హుజూరాబాద్, గంగాధర డిప్యూటీ తహసీల్దార్లు సురేష్, లక్ష్మారెడ్డి ఆర్‌ఐ దినేష్‌తనిఖీ చేశారు. అయితే ఈ రెండు మిల్లుల్లో రేషన్ బియ్యం నిల్వలు లేవని అధికారులు స్పష్టం చేశౄరు. రికార్డుల్లో నమోదు చేసిన వివరాలకు, మిల్లుల్లో ఉన్న బియ్యం, ధాన్యం నిల్వలకు ఏమైనా వ్యత్యాసం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వివరించారు. అందుకే మొత్తం నిల్వలను తూకం వేస్తున్నామని, హమాలీ కార్మికుల కొరతతో అర్థరాత్రి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. మొత్తం నిల్వలు తూకం వేస్తే తప్ప వివరాలు చెప్పలేమని తెలిపారు. శంకరపట్నం మండలం మొలంగూరు క్రాస్ రోడ్డులోని లక్ష్మీ మోడ్రన్ రైస్‌మిల్లుపై కేశవపట్నం తహశీల్థార్ సతీష్‌కుమార్, కేశవపట్నం, మల్యాల డిప్యూటీ తహసీల్దార్లు రవిందర్‌రావు, రాజేశ్వర్, ఆర్‌ఐ మనోజ్‌కుమార్ దాడులు నిర్వహించారు. ఇందులో 90క్వింటాళ్ళ బియ్యం నిల్వలు ఉండగా 12 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. పది కిలోల తలంబ్రాల బియ్యం కూడా ఉన్నాయి. మిల్లులో రికార్డులు అందుబాటులో లేకపోవడంతో యజమానిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఎఫ్‌సీఐకి లేవీగా పంపించిన బియ్యానికి సంబంధించిన వేబిల్లుల వివరాలు రికార్డులో నమోదు చేయలేదు. దీంతో మిల్లు యజమానిపై 6(క) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.