రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

న్యూఢిల్లీ (జ‌నం సాక్షి ): అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడంతో ఆయిల్‌ కంపెనీలు ధరలను సవరించడంతో ఆదివారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అత్యంత గరిష్టస్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ 80.76 దాటడం గమనార్హం. డీజిల్‌ లీటర్‌కు రూ 73.45కు చేరింది. ఇక దేశవ్యాప్తంగా లీటర్‌ పెట్రోల్‌ రూ 76.24కు చేరగా, డీజిల్‌ ధర రూ 67.57కు ఎగబాకింది.

జూన్‌ 2017లో పెట్రో ధరల రోజువారీ సవరణ అమలులోకి వచ్చిన అనంతరం దేశ రాజధానిలో తొలిసారిగా పెట్రోల్‌ లీటర్‌కు అత్యధికంగా 33 పైసలు పెరగ్గా, డీజిల్‌ 26 పైసల మేర పెరగినట్టు ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. పెట్రో ధరలు స్థానిక పన్నులకు అనుగుణంగా ఉండే ‍క్రమంలో పలు మెట్రో నగరాలు, రాష్ట్ర రాజధానులతో పోలిస్తే ఢిల్లీలో అందుబాటులో ఉన్నాయి.

కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు పెట్రో ధరలను యథాతథంగా ఉంచిన ఆయిల్‌ కంపెనీలు మే 14 నుంచి తిరిగి ధరల సవరణను చేపట్టినప్పటి నుంచి పెట్రో ధరలు వరుసగా ఏడవ రోజూ పెరిగాయి. గత వారం రోజులుగా పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ 1.61, డీజిల్‌ ధర లీటర్‌కు రూ 1.64 మేర పెరిగాయి.