రోడ్డు ప్రమాదంలో న్యూస్‌రీడర్ బద్రి దుర్మరణం
ఏలూరు,ఫిబ్రవరి8(జనంసాక్షి): టీవీ9 చానెల్ న్యూస్ ప్రజెంటర్ బద్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బద్రి ఛాతీకీ స్టీరింగ్ బలంగా నొక్కుకోవడం వల్ల ఊపిరాడక మరణించినట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా, ద్వారకా తిరుమల వద్ద ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో గాయపడ్డ బద్రి చిన్న కుమారుడు సాయి (8) కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ద్వారకా తిరుమలలో బంధువుల వివాహానికి హాజరై తిరిగి వెళుతుండగా ఆయన కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొంది. ఈ ప్రమాదంలో గాయపడ్డా బద్రి భార్య సుజాత, పెద్ద కుమారుడు, సవిూప బంధువు విజయవాడలో ఓ సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిలో చికిత్స సొందుతున్నారు. బద్రి పూర్తి పేరు కాళ్ల వీరభద్రయ్య. 2004 నుండి న్యూస్ రీడర్‌గా పనిచేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ భాస్కర్ పరిశీలించారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బద్రి భౌతికకాయానికి నివాళులర్పించారు. బద్రి స్వగ్రామమైన ఉంగుటూరుకు మరికొద్ది నిమిషాల్లో చేరుకుంటారనగా ఈ ప్రమాదం జరిగింది. బద్రి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ,రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. న్యూస్ రీడర్ బద్రి భౌతికకాయానికి టీవీ9 రవిప్రకాష్, రజినీకాంత్ తదితరులు నివాళులర్పించారు. ప్రమాదంలో దుర్మరణం చెందిన బద్రి మృత దేహానికి ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తిచేసిన అనంతరం విజయవాడ తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో బద్రి చిన్నకుమారుడు సాయి(8) కూడా మృతిచెందాడు. బద్రి మృతదేహానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.