రోడ్డెక్కిన రాహుల్‌

3

పారిశుద్ధ కార్మికుల ఆందోళనకు సంఘీభావం

న్యూఢిల్లీ,జూన్‌12(ఆర్‌ఎన్‌ఎ): పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఢిల్లీలో పారిశుద్ధ్య కార్మికులతో కలసి ఆయన ఆందోళన చేశారు. జీతాల కోసం ఆందోళన చేస్తున్న వీరికి రాహుల్‌ మద్దతు పలికారు.  సమస్యల పరిష్కారం కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు ఢిల్లీ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు మద్ధతు తెలిపిన రాహుల్‌ వారితో కలసి రోడ్డుపై బైఠాయించారు. గత మూడు నెలలుగా జీత భత్యాలు చెల్లించడం లేదంటూ ధర్నాలో ఆయన దాదాపు గంటపాటు వారితో కూర్చున్నారు. అంతకుముందు ధర్నా వద్దకు వచ్చిన రాహుల్‌ తనకు విూ ఆందోళనలో పాలు పంచుకోవాలని ఉందని, ఎన్నిగంటలయినా విూతో కలిసి ధర్నాలో కూర్చోవాలని ఉందని చెప్పారు. అనంతరం ఢిల్లీ సర్కారు, కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌ మండిపడ్డారు. యూపీఏ హయాంలో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేశారని అన్నారు. రాహుల్‌ రాకతో కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా తోడయ్యారు. రాహుల్‌కు మదద్తుగా నినాదాలు చేశారు.

రాహుల్‌ ఆందోళనతో ఢిల్లీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలకు విముక్తి లభించింది. వారి ఆందోళనలో కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ జతకట్టి అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని విమర్శల దాడికి దిగిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వ ఆలోచనలో మార్పు వచ్చింది. గత రెండు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించకుండా ఉన్న జీతభత్యాలను వెంటనే విడుదల చేయాలన్న వారి డిమాండ్‌ కు ప్రభుత్వం స్పందించింది.  రెండు మూడు రోజుల్లో వేతనాలు విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే, ఆలోపే ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ శుక్రవారం రోజే వారికి మొత్తం రూ.493 కోట్లు విడుదల చేయాల్సిందిగా నగర మేయర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వెంటనే వారికి జీత భత్యాలు చెల్లించాలని కోరారు. ఈ నెల జూన్‌ 2 నుంచి పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగడంతో ఢిల్లీలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి.