రోడ్లపై రణ నినాదం
వేలకు వేలు పోలీసోళ్లు ఎన్‌హెచ్ 7పై మోహరింపు
కోదండరామ్‌తో పాటు 13 మంది తెరాస
ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు అరెస్టు
నిర్మానుష్యంగా ఎన్‌హెచ్ 7
కోదండరామ్, ఈటెల, జూపల్లికి 4 వరకు రిమాండ్
సడక్‌బంద్ గ్రాండ్‌సక్సెస్
హైదరాబాద్, మార్చి 21 (జనంసాక్షి) :
హైదరాబాద్-బెంగళూర్ హైవే తెలంగాణ రణనినాదానికి వేదికగా నిలిచింది. పదిజిల్లాల నుంచి తరలివచ్చిన తెలంగాణ బిడ్డలు దారిపై బరిగీసి నిల్చొని జై తెలంగాణ అని గర్జించారు. సీమాంధ్ర పాలకులు, పోలీసులు ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు సృష్టించినా, అడుగడుగునా అరెస్టులు చేసినా తెలంగాణవాదులు వెరువలేదు. వివిధ మార్గాల్లో ఎన్‌హెచ్-7పైకి చేరుకొని పోరుకోక వినిపించారు. శంషాబాద్ నుంచి ఆలంపూర్ వరకు తెలంగాణ జనం పోటెత్తారు. గురువారం ఉదయం నుంచే విడతలవారీగా చేరుకుంటూ ఎన్‌హెచ్-7పై బైఠాయించారు. వాహనాలను కదలనివ్వలేదు. శాంతియుతంగా రోడ్డుపై బైఠాయించి ‘తెలంగాణ తప్ప తమకేదీ వొద్దు’ అంటూ నినాదాలు చేస్తున్నారు. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం.. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి అంటూ హోరెత్తిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించి తీరుతామని శపధం చేస్తున్నారు. గంటగంటకు ప్రజలు జాతీయ రహదారిపై చేరుకుంటుండడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ గేటు వద్దకు సడక్‌బంద్‌లో పాల్గొనేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. వారికి అగ్రభాగాన నేతలు నిలిచారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, నాయకులు జితేందర్‌రెడ్డి, పలువురు జెఎసి నేతలు రోడ్డుపై బైఠాయించారు. దీంతు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులకు, నిరసన కారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. క్రమేణా పరిస్థితి అదుపు తప్పుతుండడంతో ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, జితేందర్, తదితరులను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. అయినప్పటికీ జనం విడతలు వారీగా వస్తుండడంతో వారినందర్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. అక్కడి నుంచి పంపించి వేసేందుకు యత్నిస్తున్నారు. తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఉద్యోగులసంఘం నేత శ్రీనివాస్‌గౌడ్‌ను అలంపూర్ టోల్‌ప్లాజా వద్ద అరెస్టు చేశారు.
– షాద్‌నగర్ మండలం అన్నారం వద్ద టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు, సిపిఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ను అరెస్టు చేశారు. వారిని షాబాద్ పోలీసుస్టేషన్‌కు తరలించారు.
– ఆలంపూర్‌లో ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యను అరెస్టు చేశారు.
– మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో ఎమ్మెల్యే జోగు రామన్న, మరికొందర్ని అరెస్టు చేశారు.
– సడక్‌బంద్ కవరేజికి వెళ్లిన మీడియాపై ఆలంపూర్ సిఐ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మీడియాకు చెందిన వాహనం డ్రైవర్‌పై మండిపడ్డారు.
– జడ్చర్ల మండలం మాచవరం వద్ద మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని అరెస్టు చేశారు.
– షాద్‌నగర్ మండలం అన్నారం వద్ద బిజెపి నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు.
– మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం రాజాపూర్ వద్ద ఎమ్మెల్సీలు జనార్దనరెడ్డి, పూల రవీందర్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
న్యాయానికి సంకెళ్లా : కోదండరాం
అరెస్టుకు ముందు కోదండరాం మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అరెస్టు చేయడం అక్రమమని అన్నారు. శాంతియుతంగా నిర్వహిస్తుండడమే నేరంగా మారిందన్నారు. న్యాయాన్ని అరెస్టు చేస్తున్నారని నిరసన తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు యత్నిస్తే అది మరింత ఉజ్వలంగా పైకి లేస్తుందన్న సత్యాన్ని ప్రభుత్వం గమనించాలన్నారు. నాలుగున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే ప్రభుత్వం దమననీతికి పాల్పడడం సమంజసంగా లేదని నిరసన తెలిపారు.
అవకాశం ఇవ్వండి..:హరీష్‌రావు
శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వండి.. రెచ్చగొట్టకండి అంటూ పోలీసులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా పాలమాకుల వద్ద జాతీయ రహదారిపై నాయకులతో, కార్యకర్తలతో బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంద్రారెడ్డి అంటే తమకు ఎంతో గౌరవం ఉందన్నారు. ఆయన మాట.. ఆయన నడక అంతటా తెలంగాణమే నన్నారు. అటువంటి మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించామన్నారు. ఆయన బాట అనుసరణీయమన్నారు. అందుకనే పాలమాకుల వద్ద తాను ప్రభుత్వ వైఖరికి నిరసనగా సడక్‌బంద్‌లో పాల్గొన్నానని అన్నారు. సబితమ్మ ఎటువైపు ఉంటారో ఆమెనే తేల్చుకోవాలన్నారు. తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ బిడ్డగా ఉద్యమంలో పాల్గొంటారో.. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సిఎం నేతృత్వంలోని మంత్రివర్గంలోనే కొనసాగుతారో.. ఆమెనే తేల్చుకోవాలన్నారు. నాలుగున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షను మరో మారు కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లేందుకే తాము సడక్ బంద్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం, పోలీసులు మాత్రం తెలంగాణ వాదులను రెచ్చగొడుతున్నారన్నారు. అయినప్పటికీ శాంతియుతంగానే నిరసన తెలుపుతామన్నారు. సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని చెప్పారు. తమకు తెలంగాణ తప్ప మరోటి వద్దన్నారు. బుధవారం రాత్రే పాలమాకులకు చేరుకున్నానని, అందరితో పాటు కలిసి నిద్రపోయానని, తెల్లవారాక పాలమాకుల వద్ద జాతీయ రహదారిపైకి చేరుకుని నిరసనలో పాల్గొన్నానన్నారు. జనం మధ్య ఉండడం వల్లే తాను పోలీసుల కంటపడలేదన్నారు. లేకుంటే తనను కూడా ఈపాటికి అరెస్టు చేసి తీసుకువెళ్లేవారేనని ఆయన గురువారం ఉదయం 10గంటల సమయంలో అన్నారు.
శంషాబాద్‌కు భారీ భద్రత
తెలంగాణ రాజకీయ ఐకాస సడక్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా శంషాబాద్ విమానాశ్రయం వద్ద పోలీసులు భద్రతను మరింత పెంచారు. అడుగడుగునా పోలీసులను, కేంద్ర బలగా లను మొహరించారు. అలాగే హైదరాబాద్-కర్నూలు జాతీయ రహదారిపై భారీగా పోలీసులను, కేంద్ర బలగాలను ఉంచారు. నిరసన కారులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. అరెస్టు చేసి సమీపంలోని పోలీసుస్టేషన్లకు తరలిస్తున్నారు. సడక్ బంద్ నేపథ్యంలో శంషాబాద్-ఆలంపూర్ మధ్య దాదాపుగా 500పైగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.పలు వాహనాల అద్దాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. కర్నూలు జాతీయరహదారిలో 144వ సెక్షన్‌ను విధించారు.