ర్యాలీని రాజకీయం చేయొదు:ముస్లింలు

వక్ఫ్‌ సవరణ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలో  పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినికి చేదు అనుభవం

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినికి చేదు అనుభవం ఎదురైంది. తాము శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని రాజకీయం చేయొద్దని ఆమెను పలువురు ముస్లింలు అడ్డుకున్నారు. వక్ఫ్‌ సవరణ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ చిలకలూరిపేటలో ముస్లింలు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. కళామందిర్‌ సెంటర్‌ నుంచి ఇది ప్రారంభమైంది. చౌత్రా సెంటర్‌ వద్దకు రాగానే మాజీ మంత్రి విడదల రజిని అందులోకి ప్రవేశించి కొంత దూరం నడిచారు. ఈ క్రమంలో కొందరు అభ్యంతరం తెలిపారు. దాంతో ర్యాలీ నుంచి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు ఆమెను కోరారు. ‘అన్ని చోట్ల నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి.. పలు పార్టీల నాయకులు పాల్గొంటున్నారు.. చిలకలూరిపేటలో మాత్రమే కాదు కదా ’ అని పోలీసులతో రజిని వాగ్వాదానికి దిగారు. ‘ర్యాలీలో పార్టీలకతీతంగా ముస్లింలంతా పాల్గొన్నారు. అందుకే ఒక పార్టీకి చెందిన మిమ్మల్ని వద్దన్నాం’ అని రజినికి కొందరు ముస్లింలు తెలిపారు. చేసేదేమీ లేక ఆమె వైకాపా నాయకులతో ర్యాలీ నుంచి దూరంగా వెళ్లి, విలేకరులతో మాట్లాడి వెళ్లిపోయారు.

తాజావార్తలు