లంకలో తమిళులపై అత్యాచారాలకు నిరసనగా తమిళ చిత్ర పరిశ్రమ ధర్నా

శ్రీలంక చర్యలు నిరసిస్తూ సినీ పరిశ్రమ నిరశన దీక్ష
చెన్నై, ఏప్రిల్‌ 2 (ఎపిఇఎంఎస్‌): శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ తమిళనాడు సినీ పరిశ్రమ మంగళవారంనాడు నిరాహారదీక్షకు దిగింది. శ్రీలంక తమిళులకు తక్షణమే పునరావాసం కల్పించాలని వారి రక్షణకై చర్యలు చేపట్టాలని, తమిళులపై శ్రీలంక జరుపుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై అంతర్జాతీయ దర్యాప్తు జరపాలని సినీ పరిశ్రమ డిమాండ్‌ చేసింది. శ్రీలంక చర్యలను నిరసిస్తూ తమిళనాడులో సినిమా షూటింగ్‌లు అన్ని రద్దయ్యాయి. దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, పంపిణీ దారులు, ప్రదర్శన శాలల యజమానులు ఈ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఇక్కడి దక్షణ భారత సినీ అర్టిస్టుల సంఘ కార్యాలయ ఆవరణలో ఈ దీక్ష జరిగింది. సంఘం అధ్యక్షుడు ఆర్‌. శరత్‌కుమార్‌, అజీత్‌ కుమార్‌, సూర్యా, రజనీకాంత్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.