లంబాడ తండాలు తెలంగాణలో పంచాయతీలు : కేసీఆర్‌

హైదరాబాద్‌, మే 17 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో లంబాడీ తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తామని టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. దేవరకొండకు చెందిన కొందరు నేతలు, అభిమానులు శుక్రవారంనాడు తెలంగాణ భవన్‌కు చేరుకుని కెసిఆర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కెసిఆర్‌ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం రాగానే దేవరకొండ ప్రాంతానికి తాగునీరు అందిస్తానన్నారు. కళ్ల ముందే నాగార్జునసాగర్‌ ఉన్నా.. నీళ్లు మాత్రం అందులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం రాగానే లంబాడీల అభివృద్ధికి అనేక పథకాలు చేపట్టి అమలు చేస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. లంబాడీల కోసం అయిదు రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.  సంచార జీవితాలను అనుభవిస్తూ నేటికీ అభివృద్ధికి ఆవలే వాళ్లు నిలిచిపోయారని.. ఇదెంతో ఆవేదన కలిగించే అంశమన్నారు. తెలంగాణ రాష్ట్రం రాగానే వారి అభివృద్ధికే తొలి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.