లక్ష్మీనారాయణ బై.. బై

సొంత కేడర్‌కు బదిలీ
హైదరాబాద్‌, జూన్‌ 7 (జనంసాక్షి) :
సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ బదిలీ అయ్యారు. హైదరాబాద్‌ నుంచి సొంత కేడర్‌ మహారాష్ట్రకు లక్ష్మీనారాయణ వెళ్తున్నారు. లక్ష్మినారాయణను బదిలీ చేస్తూ ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. చెన్నై సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ అరుణాచలానికి బాధ్యతలు అప్పగించాలని లక్ష్మినారాయణకు ఆదేశాలు అందాయి. ఈ నెల 11న సీబీఐ హైదరాబాద్‌ విభాగం జెడిగా పదవీబాధ్యతల నుంచి తప్పుకుంటారు. లక్ష్మీనారాయణ 2006లో హైదారాబాద్‌ సీబీఐకి వచ్చారు. రెండు సార్లు ఆయన పదవీకాలాన్ని పొడగించారు. డెప్యుటేషన్‌ కాల పరిమితి ఏడేళ్లు పూర్తి కావడంతో లక్ష్మినారాయణను సొంత క్యాడర్‌కు పంపుతూ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డి ఓబుళాపురం మైనింగ్‌ కేసు దర్యాప్తుతో ఆయన పేరు వ్యాప్తిలోకి వచ్చింది. అత్యంత ముఖ్యమైన కేసుల దర్యాప్తును ఆయన చేపట్టారు. ఓబుళాపురం మైనింగ్‌ కేసుతో పాటు ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, వైఎస్‌ జగన్‌ ఆస్తుల కేసుల దర్యాప్తు ఆయన నేతృత్వంలో జరిగింది. సత్యం కుంభకోణం కేసు దర్యాప్తునకు కూడా ఆయనే నేతృత్వం వహించారు. జగన్‌ ఆస్తుల కేసు విచారణలో ఆయన విమర్శలను కూడా ఎదుర్కున్నారు. ఒక వర్గం మీడియాకు ఆయన లీకులు ఇస్తున్నారంటూ ఆయనపై విమర్శలు వచ్చాయి. ఇదిలావూంటే జగన్‌ ఆస్తుల కేసులో ఇప్పటి వరకు ఐదు చార్జిషీట్లను కోర్టుకు సమర్పించారు. మరో ఆరు అంశాలపై చార్జిషీట్లు దాఖలు చేయాల్సి ఉంది. జగన్‌ ఆస్తుల కేసు దర్యాప్తు కూడా పూర్తయిందని, చార్జిషీట్లు కూడా రూపొందించారని, వాటిని కోర్టుకు సమర్పించడమే ఉందని అంటున్నారు. గాలి జనార్దన్‌ రెడ్డి ఓబుళాపురం మైనింగ్‌ కేసు, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కుంభకోణం కేసు దర్యాప్తులు ఇప్పటికే ముగిశాయి. జెడి బదిలీని ఆపాలని పిటిషన్‌ సిబిఐ జెడి లక్ష్మినారాయణ బదిలీని ఆపాలని కోరుతూ కుటుంబ రావు అనే సామాజికవేత్త కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

రాష్ట్రంలో అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలు కలిగి ఉన్న జగన్‌ కేసును చాకచక్యంగా డీల్‌ చేస్తూ ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీల మన్ననలు పొందుతున్న సిబిఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మినారాయణ బదిలీ వ్యవహారం వివాదం రేపడమేకాక చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠగా కొనసాగుతున్న జగన్‌ అక్రమాస్తుల కేసులో ఇంకా విచారణ పూర్తి కాకముందే జేడీని బదిలీచేయడం పట్ల ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సిబిఐ జాయింట్‌ డైరెక్టర్‌గా డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌లో పనిచేస్తున్న లక్ష్మినారాయణ పదవీకాలం ముగిసిందనే నెపంతో ప్రభుత్వం బదిలీచేయగా రాష్ట్రప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధం అయింది. ఇప్పటికే రెండుసార్లు సర్వీసును పొడిగించ గలిగిన రాష్ట్రప్రభుత్వం మూడోసారి తన చేతుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. లక్ష్మినారాయణ బదిలీ విషయం ఈనెల 1, 2 తేదీల్లోనే జరిగినప్పటికి ఆయన మాత్రం ఈరోజు విడుదల అవుతానని ప్రకటించారు. ఈమేరకు బదిలీ వ్యవహారం ఈరోజు దుమారం లేపింది. 2006లో సిబిఐలో డిఐజి ¬దాలో హైదరాబాద్‌కు వచ్చిన ఆయన జాయింట్‌ డైరెక్టర్‌గా కూడా ఇక్కడే పదోన్నతి పొందారు. స్వతహాగా ఆయన మహారాష్ట్ర క్యాడర్‌ ఐపిఎస్‌ అధికారి. సత్యం కుంభకోణం, గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన ఓబులాపురం గనులు,  జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో చాకచక్యంగా వ్యవహరించారు. గాలి జనార్దన్‌రెడ్డి కేసులో బెయిల్‌ కుంభకోణాన్ని కూడా వెలుగులోకి తీసుకువచ్చిన లక్ష్మినారాయణ బృందం న్యాయమూర్తులను సైతం జైలుపాలుచేసి సంఛలనం సృష్టించారు. ఇదిలా ఉండగా లక్ష్మినారాయణ బదిలీని ఆపాలంటూ హైకోర్టులో పిల్‌ను ఓన్యాయవాది వేశారు. జేడీ లక్ష్మినారాయణ బదిలీని పథకం ప్రకారమే ప్రభుత్వం చేసిందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లోగా జగన్‌ను బయటకు తీసుకువచ్చి కాంగ్రెస్‌ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ ఆరోపించింది.