లఖింపూర్‌ దారుణాన్ని రాష్ట్రపతికి వివరిస్తాం


` ప్రియాంకా,రాహుల్‌
` అనుమతి కోరుతూ రాష్ట్రపతి భవన్‌కు లేఖ
దిల్లీ,అక్టోబరు 10(జనంసాక్షి): లఖింపుర్‌ ఖేరి ఘటనకు సంబంధించిన వాస్తవాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వివరించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యుల బృందం రాష్ట్రపతిని కలవనున్నట్లు తెలిపింది. ఇందుకోసం అనుమతి కోరుతూ రాష్ట్రపతి భవన్‌ తాజాగా లేఖ రాసింది. ఈ బృందంలో రాహుల్‌ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ వాద్రా, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఏకే ఆంటోని, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌, గులాం నబీ ఆజాద్‌, అధీర్‌ రంజన్‌ ఛౌదురి రాష్ట్రపతిని కలువనున్నారు.‘లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో నలుగురు రైతులతో సహా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు కారణమంటూ రైతులు, ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. ఆశిష్‌ మిశ్రతోపాటు ఆయన అనుచరులు స్వయంగా వాహనం నడుపుకుంటూ తమపైకి దూసుకొచ్చినట్లు రైతులు చెబుతున్నారు. అయినప్పటికీ నిందితులతోపాటు కేంద్ర మంత్రిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు’ అని రాష్ట్రపతి భవన్‌కు రాసిన లేఖలో కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. ఈ నేపథ్యంలో లఖింపుర్‌ హింసకు సంబంధించిన వాస్తవాలతో కూడిన పూర్తి సమాచారాన్ని రాష్ట్రపతి ముందుంచేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతి భవన్‌ను కోరింది. ఇక ఈ కేసులో భాగంగా కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రను సుదీర్ఘంగా విచారించిన యూపీ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. తాజాగా ఆయనను కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న లఖింపుర్‌ ఖేరి ఘటనను రెండు వర్గాల మధ్య యుద్ధంగా మార్చే ప్రయత్నం జరుగుతోందంటూ భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు కథనాలు అనైతికమైనవి, అత్యంత ప్రమాదకరమైనవి అన్నారు. జాతీయ సమైక్యతను ప్రమాదంలో నెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే ప్రయత్నాలు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని హితవు పలికారు.

(మోదీ స్నేహితులకు తప్ప.. ఎవరికీ భద్రత లేదు: ప్రియాంకా గాంధీ)
లక్నో,అక్టోబరు 10(జనంసాక్షి):ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఆయన ధనిక స్నేహితులకు తప్ప, ఎవరికీ భద్రత లేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. దేశంలోని పేదలు, దళితులు, మహిళలకు భద్రత లేకపోయినా ఆయన బిలియనర్‌ స్నేహితులు మాత్రం బాగా ఉన్నారని ఆమె విమర్శించారు. ప్రధాని మోదీ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఆదివారం ‘రైతులకు న్యాయం’ పేరుతో భారీ బహిరంగ సభను ప్రియాంక నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు.ప్రియాంక గాంధీ తన ప్రసంగాన్ని శ్లోకాలతో ప్రారంభించారు. ‘ఈ రోజు నవరాత్రులలో నాల్గవ రోజు. నేను ఈ రోజు ఉపవాసం పాటిస్తున్నాను. నేను మాత స్తుతితో మొదలుపెట్టాలనుకుంటున్నాను. ఇది నవరాత్రుల సమయం కాబట్టి, నా హృదయంతో మాట్లాడాలని అనుకున్నాను’ అని ప్రసంగాన్ని ప్రారంభించారు. లఖింపూర్‌ ఖేరీ ఘటనలో నిందితుడైన మంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రాను కాపాడేందుకు సీఎం యోగి ఎందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తమను జైల్లో పెట్టి కొట్టినా సరే న్యాయం కోసం పోరాడతామని తెలిపారు. లక్నోను సందర్శించిన ప్రధాని మోదీ లఖింపూర్‌ ఖేరీలో బాధిత రైతులను ఎందుకు పరామర్శించలేదని ఆమె ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను ఆ పదవి నుంచి తొలగించే వరకు తన పోరాటం కొనసాగుతుందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిగా నిరసన చేస్తున్నా వారితో మాట్లాడేందుకు మోదీకి సమయం లేదని ప్రియాంక గాంధీ విమర్శించారు. దేశంలో ఒక వైపు ద్రవ్యోల్బణం, మరోవైపు నిరుద్యోగ సమస్య పెరుగుతున్నదని ఆరోపించారు. ఈ సమస్యల కారణంగా ప్రజలు ప్రభుత్వంపై కోపంతో ఉన్నారని, కలత చెందుతున్నారని అన్నారు. ప్రజలు తమ ఉద్యోగాలు కోల్పోతున్నప్పటికీ, చిన్న వ్యాపారాలు మూతపడుతున్నప్పటికీ ప్రధాని మోదీ ధనిక స్నేహితులు బిలియన్ల కొద్దీ డబ్బు సంపాదిస్తున్నారని ఆమె మండిపడ్డారు.ప్రధాని మోదీ తన కోసం రూ.16,000 కోట్లతో రెండు విమానాలు కొనుగోలు చేశారని, ఆపై ఎయిర్‌ ఇండియాను రూ.18,000 కోట్లకు విక్రయించారని ప్రియాంక గాంధీ విమర్శించారు. ‘ఈ దేశం ప్రధాని మోదీ, ఆయన మంత్రుల ఆస్తి కాదు. ఈ దేశం విూది. ఇది విూకు తెలియకపోతే, విూరు విూ సొంత దేశాన్ని, మిమ్మల్ని విూరు రక్షించుకోలేరు. ఈ దేశాన్ని విూరే నిర్మించారు’ అని వ్యాఖ్యానించారు. ‘విూరు మార్పు కోరుకుంటే, నాతో రండి. కలిసి పోరాడి ఈ ప్రభుత్వాన్ని మార్చండి. ఇక్కడ మార్పు తీసుకువచ్చే వరకు నా పోరాటాన్ని ఆపను’ అని అన్నారు.