లాభాల బాటలో మార్కెట్లు

ముంబయి,మే28( జ‌నం సాక్షి ): ముడి చమురు ధరల తగ్గడం, రూపాయి బలపడటంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాల బాటలో పయనించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 35వేల పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 10,700 పాయింట్లకు చేరువైంది. దేశీయ మదుపరులు కొనుగోళ్ల అండతో సూచీలు దూసుకెళ్లాయి. ఉదయం స్టాక్‌మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లోనే 150 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌35వేల మార్కును దాటింది. ఆయిల్‌, గ్యాస్‌, పీఎస్‌యూ, హెల్త్‌కేర్‌, స్థిరాస్తి, మూలధన, లోహ, బ్యాంకింగ్‌ షేర్లు సానుకూల ధోరణితో కదిలాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 1.88శాతం తగ్గి బ్యారెల్‌ 75డాలర్లకు చేరడం కూడా మార్కెట్‌కు కలిసొచ్చింది. దీనికి తోడు వాయిదా పడిన అమెరికా, ఉత్తరకొరియా నేతల భేటీకి ఏర్పాట్లు చేస్తుండటంతో ఏర్పడిన అంతర్జాతీయ సానుకూల పరిణామాలు మార్కెట్‌కు కలిసొచ్చాయి. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఒక దశలో 35,240 పాయింట్ల వద్ద గరిష్ఠ స్థాయిని చేరుకోగా, ఆ తర్వాత 240 పాయింట్ల లాభంతో 35,165పాయింట్ల వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 83పాయింట్ల లాభంతో 10,688 వద్ద ముగిసింది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో సన్‌ఫార్మా, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, గెయిల్‌, లుపిన్‌ తదితర షేర్లు లాభపడగా, టెక్‌ మహీంద్రా, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హిందాల్కో షేర్లు నష్టాలను చవి చూశాయి.