లీటరు పెట్రోల్‌పై కేంద్రానికి రూ.25 బొనాంజా:చిదంబరం‌

దిల్లీ: పెట్రోల్‌, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజువారీ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార భాజపాపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం కూడా భాజపాపై ధ్వజమెత్తారు. ప్రభుత్వం తలచుకుంటే లీటర్‌ పెట్రోల్‌పై కనీసం రూ. 25 వరకు తగ్గించొచ్చని, కానీ అలా చేయట్లేదని విమర్శించారు.

‘అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పుడు లీటర్‌ పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వానికి రూ. 15 ఆదా అవుతుంది. ఇక అదనపు పన్నుల కింద ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌పై రూ. 10 వసూలు చేస్తోంది. అంటే లీటర్‌ పెట్రోల్‌పై రూ. 25వరకు కేంద్రమే తీసుకుంటోంది. నిజానికి అది సగటు వినియోగదారుడికే చెందాలి. లీటర్‌ పెట్రోల్‌పై రూ. 25వరకు తగ్గించడం ప్రభుత్వానికి సాధ్యమే. కానీ అలా చేయకుండా రూ. 1, రూ. 2 తగ్గిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.’ అని చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

కర్ణాటక ఎన్నికల నిమిత్తం 19 రోజుల పాటు స్థిరంగా ఉన్న చమురు ధరలు ఆ తర్వాత నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. 9 రోజుల్లో రూ. 2వరకు పెరిగి జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి. దీంతో సగటు వినియోగదారుడు బెంబేలెత్తుతున్నాడు.