లైంగిక హింస ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి సంతకం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి3 (జనంసాక్షి) :
లైంగిక హింస ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జి ఆదివారం ఆమోద ముద్ర వేశారు. దేశవ్యాప్తంగా నిత్యం మహిళలపై పలు రకాల అకృత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందరో మహిళలు లైంగిక పరమైన వేధింపులను తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడటమో, హత్యకు గురికావడమో జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో నడుస్తున్న బస్సులో కొందరు కీచకులు పారామెడికల్‌ విద్యార్థిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి తీవ్రంగా హింసించారు. ఒంటిపై దుస్తులు కూడా లేకుండా నడుస్తున్న బస్సులోంచి నడిరోడ్డుపైకి తోసేశారు. ఆమె కొన్నాళ్లు మృత్యువుతో పోరాడి తనువు చాలించింది. ఆమెకు మద్దతుగా దేశం యావత్తూ ఏకమైంది. మహిళలు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయగా లైంగికపరమైన నేరాలను అరికట్టేందుకు గాను సంబంధిత చట్టాలలో మార్పులకు ఉద్దేశించిన క్రిమినల్‌ చట్టం (సవరణ) ఆర్డినెన్స్‌ 213కు ఆమోదం తెలియజేస్తూ భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆదివారం సంతకం చేశారు. ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ నేపధ్యంలో లైంగిక నేరాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం నిమించిన జెఎస్‌ వర్మ నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ ఆర్డినెన్స్‌పై కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదముద్ర వేసింది. మహిళలపై లైంగిక దాడి, యాసిడ్‌ దాడి, అత్యాచారం, అక్రమంగా తరలింపులు తదితర కేసులో మరింత కఠినశిక్ష, అరుదైన కేసుల్లో మరణశిక్షను ఈ ఆర్డినెన్స్‌ ప్రతిపాదిస్తుంది. అయితే మహిళలపై జరుగుతున్న లైంగిక నేరాలను నిరోధించే శక్తి ఆర్డినెన్స్‌కు లేదంటూ సోమవారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలు తెలియజేయాలని మహిళా సంఘాలు నిర్ణయించాయి.