లైసెన్స్ లేకుండా విక్రయాలు చేస్తే కఠిన చర్యలు

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): ఆహార పదార్థాలు విక్రయించే వ్యాపారులకు లైసెన్స్‌ లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి అన్నారు.పదార్థాలు కల్తీ చేసినా, అక్రమంగా అమ్మకాలు కొనసాగించినా జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. జాతీయ రహదారిపై ఉన్న దాబాలలో ఆహారాన్ని కల్తీ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు రావడంతో శనివారం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, మున్సిపల్ అధికారులు, సివిల్ సప్లయ్ అధికారులు సంయుక్తంగా కలిసి దాబాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు హోటల్స్ నుండి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. లైసెన్స్ లేని ఐదు హోటల్స్ కు నోటీసులు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధిత రంగులను మాంసాహారంలో వినియోగించడం, వినియోగించిన వంట నూనెలను పదేపదే ఉపయోగించి ఆహార పదార్థాలను తయారు చేస్తే  చర్యలు తీసుకుంటామన్నారు.ఆహార పదార్థాలను విక్రయించే వారు రిజిస్ట్రేషన్‌ గానీ లైసెన్స్‌ గానీ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. లైసెన్స్ లేని హోటల్స్, దాబా లకు నోటీసులు అందించామని, వారం రోజులలో లైసెన్స్ తీసుకోకపోతే వాటిని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.జిల్లావ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపడతామన్నారు. హోటళ్లతో పాటు దాబాల్లోనూ కల్తీ ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి వాటిపైనా తనిఖీలు చేపడతామన్నారు.ఆహార పదార్ధాలు నిల్వ ఉంచి,నాణ్యత ప్రమాణాలు పాటించని పలు హోటళ్లకు రూ.14వేలు జరిమానా విధించారు.ఈ తనిఖిలలో ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణ మూర్తి , మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి, డిటి సీఎస్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.