లోకసభ స్పీకర్ తోపాటు బెల్జియం బయల్దేరిన ఎంపి కవిత
న్యూఢిల్లీ: యూరోపియన్ యూనియన్ (ఈయూ) సభ్యదేశాల్లో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం టిఆర్‌ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత ఆదివారం రాత్రి బెల్జియం బయలుదేరి వెళ్లారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందం.. ఈయూ పార్లమెంట్ వ్యవహారాలపై అధ్యయనంతోపాటు ప్రస్తుతం జరుగుతున్న ప్లీనరీ సమావేశాలను వీక్షిస్తుంది. బెల్జియం, బ్రస్సెల్స్, సైప్రెస్, బ్రూజెస్ తదితర నగరాలలో పర్యటిస్తుంది. భారత్‌తో కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలతోపాటు విదేశీ వ్యవహారాలపై ఈయూ విధానపరమైన నిర్ణయాలను కూడా ఈ బృందం అధ్యయనం చేస్తుంది. ఇందుకోసం ఈయూ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్, సభ్యులతో ఈ బృందం సమావేశమవుతుంది. బెల్జియంతోపాటు వివిధ నగరాల్లోని భారత సంతతి ప్రజలతో సమావేశమై వారి అనుభవాలను తెలుసుకుంటుంది. ఈ పర్యటనలో స్పీకర్ సుమిత్రా మహాజన్, కవితలతో పాటు మరో ఇద్దరు బిజెపి ఎంపీలు, కాంగ్రెస్, శివసేన, బీఎస్పీల తరపున ఒక్కో ఎంపీ కూడా ఉన్నారు. ఆదివారం రాత్రి బయలుదేరిన ఈ బృందం 26 ఉదయం తిరిగి ఢిల్లీకి చేరుకుంటుంది.