లోక్‌సభ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల ముందంజ

ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్ర‌భంజ‌నం కొన‌సాగుతోంది. కూట‌మి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి 154 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జ‌న‌సేన పోటీ చేసిన 21 స్థానాల‌కు గాను 19 చోట్ల లీడింగ్‌లో ఉంది. వైసీపీ 20కి పైగా చోట్ల‌ ఆధిక్యంలో కొన‌సాగుతోంది. వైసీపీ నుంచి మంత్రులంతా వెనుకంజలోనే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఒక్క సీఎం జగన్ మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు.

డోన్‌లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, న‌గ‌రిలో రోజా, గుడివాడలో కొడాలి నాని, చెల్లుబోయిన వేణు, మంత్రి అంబటి రాంబాబు, మంత్రి అమర్ నాథ్, మంత్రి కాకాణి, జోగి రమేశ్, బొత్స సత్యనారాయణ, వనిత ఇలా మంత్రులంద‌రూ వెనుకంజలోనే ఉన్నారు. మాచర్లలో పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కూడా వెనుక‌బ‌డ్డారు. ఈసారి కూట‌మి సునామీ సృష్టించింద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం ఇదే జోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కూటమి కార్యకర్తలు బాణాసంచా కాల్చి గెలుపు సంబరాలు చేసుకుంటున్నారు. ఏపీలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అసెంబ్లీతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.

శ్రీకాకుళంలో కింజరాపు రామ్మోహన్‌నాయుడు (తెదేపా), అనకాపల్లిలో సీఎం రమేశ్‌ (భాజపా), రాజమహేంద్రవరంలో దగ్గుబాటి పురందేశ్వరి (భాజపా), విజయవాడలో కేశినేని చిన్ని (తెదేపా) ముందంజలో ఉన్నారు. గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్‌ (తెదేపా), నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (తెదేపా) ఆధిక్యంలో కొనసాగుతున్నారు.