లోక్‌సభ ఎన్నికల్లోనూ పైచేయికి టిఆర్‌ఎస్‌ వ్యూహం

కార్యకర్తలతో క్షేత్రస్థాయిలో చర్చలు
భారీ మెజార్టీ లక్ష్యంగా గెలుపునకు కృషి
వరంగల్‌,మార్చి19(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టిన ప్రజలు ఎంపీ ఎన్నికల్లో సైతం అదే ఊపుతో 16 సీట్లను గెలిపించి గులాబీ అభ్యర్థులను ఢిల్లీకి పంపుతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. కాంగ్రెస్‌ టిడిపిలకు కాలం చెల్లిందని అన్నారు. ఢిల్లీలో మన వాణి వినిపించాలంటే మన ఎంపిలు ఉండాలన్నారు. దేశానికి కాబోయే ప్రధాని, దేశ్‌కీ నేత సీఎం కేసీఆరేనని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు. కష్టించిన ప్ర తీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, రా బోయే రోజుల్లో ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా అవకాశం కలుగుతుందన్నారు. పార్టీలో ఉంటూ గ్రూపులు కట్టి ద్రోహం చేయాలనుకునేవారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించమని, పార్టీ పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యకర్తలంతా సమష్టిగా శ్రమించి ఎంపీ ఎన్నికలో పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు.  ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనే వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ పునరావృతం చేసేందుకు జిల్లా ప్రజలంతా గులాబీ పార్టీ వైపే మొగ్గు చూపుతుండడంతో భువనగిరి, వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు దాదాపు ఖాయమని తెలుస్తోంది. అయితే, ఈ నియోజకవర్గాల నుంచి భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఐదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దాదాపు ప్రతీ ఇంటికి ఏదోరకంగా చేరాయి. దీంతో గత డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు భారీ మెజార్టీని కట్టబెట్టారు. గులాబీ పార్టీ దూకుడుకు తట్టుకోలేక కాంగ్రెస్‌ పార్టీ కుదేలైంది. అదే పరిస్థితి లోక్‌సభ ఎన్నికల్లోనూ రిపీట్‌ కాబోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పోటీలో నిలిచేందుకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు జంకుతున్నారు.  భువనగిరి పార్లమెంట్‌ పరిధిలో జనగామ నియోజకవర్గం, వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలో పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ సెగ్మెంట్లు ఉండడంతో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహా ఇద్దరు శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్‌ తాటికొండ రాజయ్య ఎవరివారే భారీ మెజార్టే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి జిల్లాలో లోక్‌సభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో చరిత్రలో నిలిచిపోయే విధంగా గులాబీ పార్టీ అభ్యర్థులు మెజార్టీ సాధించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహాలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఇటు భువనగిరి, అటు వరంగల్‌లో పార్లమెంట్‌ సన్నాహక సమావేశాల్లో పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొని కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశర చేశారు. మరోపక్క టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం కరీంనగర్‌లో లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించడమే తమ లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తుండడంతో జిల్లావ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొంది.