లోపభూయిష్టంగా గవర్నర్ల వ్యవస్థ 

వ్యవస్థీకృత మార్పు జరక్కపోతే భవిష్యత్‌లో ఇలాగే ఉండే ప్రమాదం
న్యూఢిల్లీ,మే21(జ‌నం సాక్షి): ఈ దేశంలో గవర్నర్ల వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందన్న విమర్శలు మరోమారు చర్చకు వచ్చింది.  గవర్నర్లు ఫెడరల్‌ విధానానికి సమాధి కడుతున్న తీరు కర్నాటక వ్యవహారంతో విమర్శలకు దారితీసింది.  అయితే అతిపెద్ద పార్టీగా కర్నాటకలో గవర్నర్‌ బిజెపిని ఆహ్వానించినా అవతల జనతాదళ్‌, కాంగ్రెస్‌ కూటమి స్పష్టమైన మెజార్టీ చూపినా స్పందించకపోవడం, సంప్రదాయం ప్రకారం నడుచుకోవడం విమర్శలకు దారితీసింది. కేంద్రం ఏజెంట్లుగా పనిచేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం పాల్జేస్తున్నారన్న విమర్శలకు మరోమారు బలం చేకూరింది.  కేవలం కేంద్రం చెప్పినట్టు చేస్తూ రాష్ట్రాల అధికారాలను కాలరాస్తున్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులను గవర్నర్లుగా నియమిస్తుండడంతో ఈ దుస్థితి దాపురించింది. రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రజాభీష్టానికి అనుగుణంగా నడవకుండా తమ పార్టీలకు చెందిన వారికి అవకాశం ఇస్తూ, రాజకీయ బేరసారాలకు అవకాశమిస్తున్నారు. అనేక రాష్ట్రాలలో గతంలో కాంగ్రెస్‌ హయాంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు కర్ణాటకలోనూ అదే జరిగింది. కేంద్రం కీలు బొమ్మలుగా వ్యవహరిస్తూ రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయడమే మంచిదన్న డిమాండ్‌ను బిజెపి పట్టించుకోవడం లేదు. కర్ణాటకలో ఓటరు స్పష్టమైన మద్దతు ఎవరికీ పలకని నేపథ్యంలో అధికారం కోసం వైరిపక్షాల మధ్య ఎత్తులూ పై ఎత్తులు ఉధృతంగా సాగాయి. గవర్నర్‌ స్పష్టంగా మెజార్టీ ఉన్న కూటమిని కాదని అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపిని ప్రభుత్వం ఏర్పాటుకు పిలిచి అభాసుపాలయ్యారు. రెండు పార్టీల కూటమికి స్పష్టంగా మెజారిటీ కనపడుతున్నప్పుడు, చాలీచాలని మెజారిటీ ఉన్న పార్టీ ఏవిధంగా అదనపు బలం సాధించాలో, సాధించగలదో అన్నది గ్రహించలేదు.  అధికార రాజకీయాలు బురదకూపంలో మునిగాయి.  ఫలితంగా రాజ్యాంగ నియమాలు, స్ఫూర్తి దెబ్బతింటున్నాయి. ప్రస్తుతం వ్యవస్థలో కనబడుతున్న లోపాల్ని సరిదిద్దేలా ప్రజా చైతన్యం కావాలి. రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌, స్పీకర్‌లకు కొన్ని కీలక సందర్భాల్లో అమితమైన విచక్షణాధికారం ఉంది. అది ఎక్కువగా దుర్వినియోగం అవుతోంది. వారి విధులపై స్పష్టత, జవాబుదారీతనం ఉండేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలి. కుర్చీ కోసం రాజకీయ పార్టీలకు వంతపాడని విధంగా వ్యవస్థలోనే పకడ్బందీ నిబంధనలను ఏర్పరుచుకోవడం అవసరం. తాజాగా కర్నాటకతో మేల్కోవాలి.