లోపాలను సరిదిద్దుకుంటాం సమన్వయంతో ముందుకు సాగుతాం

విజయవాడ సడక్‌బంద్‌
చలో అసెంబ్లీ తేదీలు ప్రకటిస్తాం
టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
హైదరాబాద్‌, మార్చి 30 (జనంసాక్షి): బెంగళూరు రహదారిపై తెలంగాణ రాజకీయ జెఎసి నిర్వహించిన ‘సడక్‌బంద్‌’ విజయవంతమైందని జెఎసి చైర్మన్‌ కొదండరాం అన్నారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో నిర్వహించిన జెఎసి విస్తృతస్థాయి సమావేశం ముగిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సడక్‌బంద్‌ కార్యక్రమం సందర్భంగా పలువురు తెలంగాణ నేతలు, కార్యకర్తలను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. త్వరలో విజయవాడ రహదారిని నిర్బంధం చేస్తూ ‘సడక్‌బంద్‌’ను నిర్వహించనున్నట్లు కోదండరాం ప్రకటించారు. తొలి విడత  సడక్‌ బంద్‌ నిర్వాహణలో కొన్ని సమన్వయ లోపాలున్నాయని, వాటిని సరిదిద్దుకుని మలివిడత బంద్‌కు సిద్ధమవుతున్నామని చెప్పారు.

ఏప్రిల్‌ 3న జెఎసి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు జెఎసి చైర్మన్‌ కోదండరాం ప్రకటించారు. ఈ సమావేశం చాలా కీలకమైందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలోనే తెలంగాణ ఉద్యమ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తామని అన్నారు. విజయవాడ రహదారిపై నిర్వహించబోయే సడక్‌బంద్‌, ఛలో అసెంబ్లీ కార్యక్రమాలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.శుక్రవారం నల్గొండలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటించిన సందర్భంగా జిల్లాలో పలువురు తెలంగాణ నేతలు, కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం, బైండోవర్లు చేయడాన్ని జెఎసి తీవ్రంగా ఖండిస్తుందని చైర్మన్‌ కోదండరాం అన్నారు. ఈ విచ్చలవిడి అరెస్టులను ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపాలని చూస్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు.