లౌకికవాదం కోసం విబేధాలను పక్కనపెడతాం

– కాంగ్రెస్‌ – జేడీఎస్‌ ఆధ్వర్యంలో మంచి పాలన అందిస్తాం
– కాంగ్రెస్‌ నేత డి.కె. శివకుమార్‌
బెంగళూరు, మే21(జ‌నం సాక్షి) : కర్ణాటకలో లౌకికవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం కాంగ్రెస్‌- జేడీఎస్‌ మధ్య ఉన్న విభేదాలను తొలగించుకుంటామని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు డి.కె. శివకుమార్‌ అన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ రెండు పార్టీలు ఒకదాని విూద ఒకటి తీవ్ర విమర్శలు గుప్పించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. ‘1985 నుంచి దేవెగౌడతో రాజకీయం రణరంగంలో పోరాడుతూనే ఉన్నా. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేశా. ఆయన కుమారుడు, కోడలపై కూడా పోటీ చేసి గెలిచా. మా ఇద్దరి మధ్య అనేక రాజకీయాలు నడిచాయి. అనేక కేసులు నమోదయ్యాయి. కానీ దేశ ప్రయోజనాల నిమిత్తం, పార్టీ కోసం వాటన్నింటిని పక్కనపెట్టి, కర్ణాటకలో లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సెక్యులర్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఈ పొత్తు. అధిష్ఠానం నిర్ణయం కోసం ఈ చేదు గుళికను మింగుతా’ అని శివకుమార్‌ విూడియాకు వెల్లడించారు. శనివారం భాజపా ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేయడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జేడీఎస్‌ నేత కుమారస్వామిని గవర్నర్‌ ఆహ్వానించారు. ‘ఇప్పటి వరకు మేము మంత్రిమండలి
ఏర్పాటుపై చర్చించలేదు. ఏఐసీసీతో మాట్లాడిన తరవాతే దీనిపై నిర్ణయం తీసుకుంటాం’ అని వెల్లడించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించడానికి మహా కూటమి ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌- జేడీఎస్‌ కూటమి ఐదు సంవత్సరాలు మనగలుగుతుందా అని ప్రశ్నించగా.. అన్నింటికి కాలమే సమాధానం చెప్తుందని శివకుమార్‌ వ్యాఖ్యానించారు.