లౌకికశక్తుల ఏకీకరణ దిశగా జేడీయూ
జనతాదళ్ (యునైటెడ్) కేంద్రంలో లౌకికశక్తుల ఏకీకరణకు కంకణం కట్టుకుంది. ఆ దిశగానే కొన్నాళ్లుగా అడుగులు ముందుకు వేస్తోంది. నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ)లో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ జేడీయూ. 15వ లోక్‌సభలో ఎంపీల సంఖ్య రిత్యా ఆ పార్టీది ఐదో స్థానం. ఒకప్పటి కళ్లోల బీహార్‌లో కొన్నేళ్లుగా అధికారపక్షం. బీహార్‌ను అన్నింటా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్న రాజకీయ పక్షం. బీజేపీకి 115 మంది ఎంపీలుంటే, జేడీయూకు 20 మంది ఎంపీలున్నారు. కేంద్రంలో వరుసగా రెండు పర్యాయాలు యూపీఏ అధికారంలో కొనసాగుతోంది. ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు, ఎంతకీ అదుపులోకి రాని ద్రవ్యోల్బణం, పాలకపక్షంలో పెచ్చుమీరిపోతున్న అవినీతి, ఆశ్రిత పక్షపాతం వల్ల ప్రజలు మార్పు కోరుకోవడం తథ్యమని, తద్వారా 2014లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాము విజయం సాధించి అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని ఎన్‌డీఏ పెద్దన్న బీజేపీ భావిస్తోంది. ఆ పార్టీకి ప్రధాన బలం హిందుత్వం. ఈ సారి ఆ బలాన్ని ఉపయోగించుకొనే ఎన్నికల్లో లబ్ధిపొందాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకోసం పక్కా ప్రణాళికతో పావులు కదపడం ప్రారంభించింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే హిందువుల ఓట్లు గంపగుత్తాగా తమపార్టీకే పడతాయని ఆ పార్టీ లెక్కకట్టుకుంది. అందుకే బీజేపీ అగ్రనేతలు మొదలు సామాన్య కార్యకర్తల వరకూ మోడీ పాట అందుకున్నారు. అదే సమయంలో మోడీ అభ్యర్థిత్వాన్ని ఎన్‌డీఏ ప్రధాన భాగస్వామ్యపక్షం జేడీయూ తీవ్రంగా వ్యతిరేకించింది. ఢిల్లీలో జరిగిన ఆ పార్టీ జాతీయ స్థాయి సమావేశాల్లో ఈమేరకు ఏకగ్రీవంగా నిర్ణయం ప్రకటించింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లను, ప్రత్యేకించి ఒకవర్గం ప్రజలపై జరిగిన ఊచకోతను నియంత్రించడంలో మోడీ విఫలమయ్యాడని ఆరోపించింది. అలాంటి వ్యక్తిని దేశ ప్రధానిగా అంగీకరించబోమని తేల్చిచెప్పింది. భారతదేశం లౌకికదేశమని, ప్రధాని అయ్యే వ్యక్తి కచ్చితంగా లౌకికవాదే అయి ఉండాలని జేడీయూ పేర్కొంది. ఒక వర్గం ప్రజలపై హత్యాకాండను చూస్తూ ఊరుకున్న మోడీని ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ప్రచారంలోకి తీసుకురావడాన్నీ తప్పుబట్టింది. ప్రధాని అభ్యర్థి ఎవరో ముందుగానే ప్రకటించాలని కోరుతూనే అతడు మోడీ కావొద్దని స్పష్టం చేసింది. బీజేపీ అగ్రనేతలు వాజపేయి, సుష్మస్వరాజ్ ప్రధాని అభ్యర్థులయితే తమకేమీ అభ్యంతరం లేదని కూడా తేల్చిచెప్పింది. మతతత్వ శక్తులను అధికార పీఠంపై కూర్చోబెట్టాలనే సంఘ్ పరివార్, విశ్వహిందూ పరిషత్‌కు ముందుగానే చెక్ పెట్టేందుకు జేడీయూ సిద్ధపడింది. కేంద్రంలో లౌకిక శక్తుల పునరేకీకరణపై జేడీయూ దృష్టిం సారించడంతో మిగతా రాజకీయ పక్షాలు ఆ దిశగానే అడుగులు వేసేందుకు సిద్ధపడుతున్నాయి. తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, ఉభయ కమ్యూనిస్టులతో పాటు ఎన్‌డీఏ, యూపీఏల్లోని వివిధ సెక్యులర్ పార్టీలు జేడీయూ పిలుపునకు సానుకూలంగా స్పందిస్తున్నాయి. కేంద్రంలో మతతత్వ శక్తులు అధికారాన్ని చేజిక్కించుకుంటే మైనార్టీలతో పాటు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని పలు పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో యూపీఏకు 2014 ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైతే తృతీయ కూటమిగా అవతరించాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. అప్పటికీ అధికారాన్ని అందుకునేంత బలం దక్కకపోతే కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలనే యోచనలో ఉన్నాయి. ఈక్రమంలో భావసారూప్యం గల ప్రత్యర్థి పార్టీలు కూడా ఒకే గొడుగు కిందకు చేరాలని ప్రయత్నిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు చోటు చేసుకున్న ఈ పరిణామంతో బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా డైలమాలో పడింది. కేంద్రంలో చాలాకాలంలో తర్వాత కాంగ్రెస్ పార్టీకి 2009లో 200లకు పైచిలుకు ఎంపీ స్థానాలు వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో ఆ స్థాయిలో సీట్లు ఏ పార్టీ సాధించే అవకాశాలు కానరావడం లేదు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న లౌకికవాద పార్టీలు 200లకు పైచిలుకు ఎంపీ సీట్లు గెలుచుకుంటే తృతీయ కూటమికి మద్దతివ్వడం మినహా కాంగ్రెస్ పార్టీకి వేరే ప్రత్యామ్నాయం ఉండబోదు. లౌకిక దేశంగా చెప్పుకునే భారత్‌లో ఇది ఆహ్వానించదగ్గ పరిణామామే. ప్రధాన రాజకీయ పక్షం అండగాలేని కలగూరకంపలాంటి పార్టీల కూటమి ఎంతకాలం అధికారంలో ఉంటుంది? అనే ప్రశ్న తలెత్తుతున్నా లౌకికవాదాన్ని పరిరక్షించేందుకు జేడీయూ చూపిన చొరవ అభినందనీయమే. ఈ చొరవను లౌకికవాదులంతా ఆహ్వానించాల్సిందే.