వంటగ్యాస్‌ సబ్సిడీ వదులుకున్నది 4శాతం మందిమాత్రమే

వీరిలో ఎక్కువ ఈశాన్య రాష్ట్రాలవారే
– ప్రధాని పిలుపుకు నామమాత్రంగానే స్పందన
న్యూఢిల్లీ, మే26(జ‌నం సాక్షి) : ఉన్నతస్థాయి సంపాదన వర్గాలు వంటగ్యాస్‌పై ప్రభుత్వం ఇచ్చే రాయితీని స్వచ్ఛందంగా వదులుకోవాలని మూడేళ్ల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ఈ మూడేళ్లలో రాయితీని వదులుకున్నది కేవలం 4శాతం మంది వినియోగదారులు మాత్రమే. కాగా.. ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారే సబ్సిడీని వద్దనుకున్నారు. మిగతా రాష్ట్రాల్లో అలాంటి వారి సంఖ్య అరకొరగానే ఉంది. ఉన్నత ¬దా, మంచి సంపాదన ఉన్నవారు వంటగ్యాస్‌పై తమకు వచ్చే రాయితీని స్వచ్ఛందంగా వదులుకోవాలని 2015 మార్చిలో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అలా చేయడం వల్ల పేద ప్రజలకు ప్రభుత్వం మరిన్ని ప్రయోజనాలు కల్పించగలదని చెప్పారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 4శాతం మంది మాత్రమే ఈ రాయితీని వదులుకున్నారు. 2016లో వంటగ్యాస్‌పై రాయితీని వదులుకున్న వారి సంఖ్య కోటి దాటగా.. ఆ తర్వాత నుంచి కేవలం 4లక్షల మంది వినియోగదారులు మాత్రమే సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకున్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే ఈశాన్య రాష్టాల్లోన్రే ఎక్కువ మంది రాయితీని వద్దనుకున్నారు. మిజోరాంలో 14శాతం, నాగాలాండ్‌లో 12శాతం, మణిపూర్‌లో 10శాతం మంది సబ్సిడీని వదులుకున్నారు.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 12శాతం, మహారాష్ట్రలో 6శాతం వినియోగదారులు సబ్సిడీని వద్దన్నారు. ఇక మిగతా రాష్ట్రాల్లో రాయితీని వదులుకున్నవారి సంఖ్య 6శాతం కన్నా తక్కువే ఉంది. కర్ణాటక, హరియాణా, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌లలో 5శాతం వినియోగదారులు, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో 4శాతం మంది, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడులో 3శాతం, పశ్చిమ్‌బంగాలో 2శాతం, ఆంధప్రదేశ్‌లో 1శాతం కంటే తక్కువ మంది వినియోగదారులు వంటగ్యాస్‌పై రాయితీని వదులుకున్నారు. ప్రధాని సొంతరాష్ట్రమైన గుజరాత్‌లోనూ ఇది కేవలం 4శాతమే ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా 26కోట్ల వంటగ్యాస్‌ కనెక్షన్లు ఉండగా.. ఇందులో 25.7కోట్లు వంటింటి అవసరాల నిమిత్తమే తీసుకున్నారు.