వచ్చే ఎన్నికల్లో అద్వాణీ, జోషీ పోటీ..!

– అగ్రనేతలను బరిలోకి దించాలనే యోచనలో మోదీ
– 75ఏళ్ల పరిమితిని పక్కనపెట్టిన బీజేపీ
న్యూఢిల్లీ, జూన్‌5(జనం సాక్షి) : బీజేపీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఉప ఎన్నికల్లో చావుదెబ్బతిన్న అమిత్‌షా, మోడీ.. మళ్లీ పాత పద్దతికి శ్రీకారం చుట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భారతీయ జనతా పార్టీ.. ఇప్పటి నుంచే కార్యాచరణ దిశగా అడుగులు వేస్తోంది. పార్టీ అగ్రనేతలను మళ్లీ రంగంలోకి దించాలని భావిస్తోంది. వయసు నిబంధనలను పక్కనబెట్టి ఎల్‌కే అడ్వాణి లాంటి సీనియర్‌ నేతలను ఎన్నికల బరిలో నిలబెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఎల్‌కే అడ్వాణీ పోటీ చేస్తే బాగుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయపడుతున్నట్లు కొన్ని విూడియాల్లో వార్తలు వెలువడుతున్నాయి. ఆయనతో పాటు మురళీ మనోహర్‌ జోషీ లాంటి అగ్రనేతలను కూడా భాజపా బరిలోకి దించాలని చూస్తున్నట్లు ఆ వార్తలు పేర్కొన్నాయి. ఈ విషయమై ఇటీవలే ప్రధాని మోదీ.. అడ్వాణీని కలిసినట్లు సమాచారం. భాజపా అధ్యక్షుడు అమిత్‌షా కూడా దీనిపై అడ్వాణీతో చర్చలు జరిపినట్లు సదరు విూడియా కథనాలు పేర్కొంటున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్‌లోని గాంధీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అడ్వాణీ పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆ తర్వాత నుంచి పార్టీలో ఆయన స్థానం తగ్గుతూ వస్తోంది. భాజపా ఉన్నతస్థాయి నిర్ణాయక మండలి అయిన పార్లమెంటరీ బోర్డులోనూ అడ్వాణీ, జోషీకి స్థానం కల్పించలేదు. దీనికి బదులుగా భాజపా అధ్యక్షుడు అమిత్‌షా మార్గదర్శక మండలి పేరుతో ఐదుగురు సభ్యులతో కూడిన సలహా మండలిని ఏర్పాటుచేసి అందులో అడ్వాణీ, జోషీలను చేర్చారు. వీరితో పాటు ప్రధాని మోదీ, అమిత్‌షా, కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ మార్గదర్శక మండలిలో సభ్యులుగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ మండలి ఒక్కసారి కూడా సమావేశం కాకపోవడం గమనార్హం. అయితే 75ఏళ్ల పైబడిన వారిని ఎన్నికలు, పదవులకు దూరంగా ఉంచాలని భాజపా ఆ మధ్య భావించింది. అయితే గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా ఆ నిబంధనను సడలిస్తూ వస్తోంది. ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో వయసు నిబంధనను పక్కనబెట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిగా యడ్యూరప్పను ఎన్నుకొంది. తాజాగా అడ్వాణీ, జోషీలను వచ్చే ఎన్నికల బరిలో దింపాలని భావిస్తోంది.