వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గల్లంతవ్వడం ఖాయం
– బి.వి. రాఘవులు జోస్యం
హైదరాబాద్, ఆగస్టు 10 (జనంసాక్షి): రానున్న 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గల్లంతు కావడం ఖాయమని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వి.రాఘవులు జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందని అన్నారు. రెండవ సారి 2009 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినా విశ్వాస ఘాతకానికి పాల్పడిందని ఆరోపించారు. రాష్ట్ర మంత్రి వర్గమంతా అవినీతి కంపులో కూరుకుపోయిందని అదే విధంగా కేంద్ర ప్రభుత్వ పరిస్థితి కూడా ఇదే పరిస్థిలో ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అధికార కుమ్ములాటలే తప్ప, ప్రజా సమస్యలు పట్టవని ఆయన విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేకపోయిందని విమర్శించారు.
అన్ని వర్గాల ప్రజల ఆశాలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని రాఘవులు విమర్శించారు. రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. విద్యుత్ సమస్యను ప్రభుత్వం పట్టించుకోనందునే అది పెనుభూతంలా తయారైందని అన్నారు. రాష్ట్రంలోని సహజ వనరులను ఇతర రాష్ట్రాలు తరలించుకుపోతున్న ప్రభుత్వానికి పట్టనట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అమలు కాని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కాంగ్రెస్ పార్టీ ప్రాంతాల మధ్య విద్వేశాలు రెచ్చగొట్టిందని ఆయన విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.
రాష్ట్రంలో 2014 వరకు తమ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తమతో కలిసివచ్చే అన్ని పార్టీలతో పోరాడుతామని అన్నారు. మంత్రి దానం నాగేందర్‌కు కార్మిక శాఖ కంటే దేవాదాయ శాఖపైనే ఎక్కువ మక్కువ ఉందని తెలుస్తోందని అన్నారు. ఇస్కాన్ వ్యవహారంలో మంత్రుల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దానం నాగేందర్ కార్మిక శాఖను పూర్గిగా భ్రష్టు పట్టించారని రాఘవులు విమర్శించారు.