వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మూడో స్థానమే
– త్రిముఖపోటీలో జనసేనదే విజయం
– సీపీఎం ఏపీ కార్యదర్శి మధు
అమరావతి, జూన్29(జనం సాక్షి ) : వచ్చే ఎన్నికల్లో ఆంధప్రదేశ్‌లో త్రిముఖ పోటీ కనిపిస్తోందని సీపీఎం ఏపీ కార్యదర్శి పి.మధు అన్నారు. శుక్రవారం తిరుపతిలో విలేకరులతో మాట్లడారు.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో త్రిముఖ పోటీ ఖాయమని స్పష్టం చేశారు. జనసేన మొదటి స్థానంలో… వైసీపీ రెండో స్థానంలో ఉంటే… తెలుగుదేశం పార్టీ మూడో స్థానంలోకి వెళ్లిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. టీడీపీ పాలనపై, చంద్రబాబు అసహనంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, అదే విధంగా వైసీపీ ప్రతిపక్ష పాత్రను పూర్తిస్థాయిలో పోషించలేక పోయిందన్నారు. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా నూతనంగా ఆవిర్భవించిన జనసేనే మేలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప ఉక్కు పరిశ్రమపై కేంద్రం వెంటనే స్పందించి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ సాధనకై త్వరలోనే ఏపీ బంద్ నిర్వహిస్తామని మధు ప్రకటించారు. ఆలస్యంగానైనా తెలుగుదేశం నాయకులు ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష కూర్చోవడం సంతోషించదగ్గ విషయం అన్నారు మధు… మరోవైపు నష్టాల్లో ఉన్న మామిడి రైతులు, పాల ఉత్పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను ప్రభుత్వం ఆదుకోకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించిన ఆయన… దళితులు, గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములను
ప్రభుత్వం బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దళితులు, గిరిజనుల అస్డైన్ భూములకు ప్రభుత్వం పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.
———————————