వట్టి మాటలు కట్టిపెట్టండి

3

– కోటి ఎకరాలు మన లక్ష్యం

– అధికారులపై హరీశ్‌ ఫైర్‌

హైదరాబాద్‌,మే27(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్ప ఇంజినీర్‌ అని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కొనియాడారు. ఆయన వివిధ ప్రాజెక్టులపై తీసుకున్న చొరవ, నిర్ణయాల కారణంగా రానున్న రోజుల్లో తెలంగాణ కోటి ఎకరాల మాగాణ కాబోతున్నదన్నారు. రీ డిజైనింగ్‌ ద్వారా నీటిని అద్భుతంగా వాడుకునే అవకశాలు ఏర్పడ్డాయన్నారు.  తెలంగాణ రాష్ట్రం రెండు జీవనదుల మధ్య ఉన్నా ఇంకా సాగునీటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలపైనే దృష్టిసారించారన్నారు. జోన్‌ -5, 6కు సంబంధించి సివిల్‌, మెకానికల్‌ విభాగంలో అసిస్టెంట్‌ ఇంజినీర్లకు నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా హరీష్‌రావు మాట్లాడారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నదే సీఎం లక్ష్యమని ఉద్ఘాటించారు. భవిష్యత్‌ అవసరాలకు అనుకూలంగా ప్రాజెక్టుల డిజైన్‌ను సీఎం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 40 వేల ఉద్యోగాల భర్తీకి పక్రియ మొదలైందన్నారు. నీటి పారుదల శాఖలో ఖాళీల భర్తీ పక్రియ కొనసాగుతుందని చెప్పారు. జోన్‌-5లో సివిల్‌ -112, మెకానికల్‌-12 మందికి, జోన్‌-6లో సివిల్‌ -106, మెకానికల్‌-12 మంది అసిస్టెంట్‌ ఇంజినీర్లకు నియామక పత్రాలు అందజేశారు.  వచ్చే రెండేళ్లలో లక్ష ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుందని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు. జలసౌధలో నూతనంగా ఉద్యోగాలు పొందిన అసిస్టెంట్‌ ఇంజినీర్లకు శుక్రవారం నియామక పత్రాలను మంత్రి హరీశ్‌రావు అందజేశారు.