వడదెబ్బకు రాష్ట్రం విలవిల భానుడి ఉగ్రరూపం

ఒకే రోజు 208 మంది మృతి
జాతీయ విపత్తుగా ప్రకటించాలి
సింగరేణితో సహా సెలవులు ప్రకటించాలి
ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటినా ఎందుకు అధికారికంగా ప్రకటించరు? : కోదండరామ్‌
మృతుల కుటుంబాలకు ఆపద్బంధు వర్తింపు : సీఎం కిరణ్‌
హైదరాబాద్‌, మే 24 (జనంసాక్షి) :
వడదెబ్బకు రాష్ట్రం రాష్ట్రం విలవిల్లాడుతోంది. రెండు రోజుల నుంచి సూర్యుడు చండ్ర నిప్పులు కురిపిస్తున్నాడు. భానుడి ఉగ్రరూపానికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 60 మందికి పైగా మృత్యువాతపడగా, శుక్రవారం 208 మంది మృతిచెందారు. సూరీడు మండుతుండటం.. ఉక్కపోత.. దాహార్తితో ప్రజలు అల్లాడి పోతున్నారు. శుక్రవారం రోహిణికార్తె ప్రారంభం కావడంతో ఎండ వేడిమి ప్రజలకు నరకాన్ని చూపింది. ఉదయం 10 గంటలకే 44 నుంచి 48 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే.. ఇక మధ్యాహ్నం 2 గంటల సమయానికి 50 డిగ్రీలు దాటినట్లుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం లేదు. ఎండ వేడిమికి ఉద్యోగులు, వ్యాపారులు సైతం తల్లడిల్లుతున్నారు. విధులకు హాజరు కాలేక ఉద్యోగులు.. వ్యాపారాలు చేయలేక వ్యాపారులు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వృద్ధులు, చిన్నారులైతే వేడిమికి తాళలేక ఆసుపత్రుల పాలవుతున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకే హైదరాబాద్‌లో 44 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండం అయితే అగ్నిగుండంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. 47సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వరంగల్‌, నిజామాబాద్‌లలో 46 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెంటచింతల, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో సైతం సూరీడు భగభగమంటున్నాడు. సింగరేణి కార్మికులు విధులకు హాజరుకాలేక ఇబ్బందులు పడుతున్నారు.
శుక్రవారం రాత్రి వరకూ రాష్ట్రవ్యాప్తంగా వడగాలులతో అస్వస్థతకు లోనై 208 మంది మృత్యువాతపడ్డారు. కరీంనగర్‌ , వరంగల్‌ జిల్లాల్లో 20 మంది చొప్పున, నల్గొండలో 15, ఖమ్మంలో 15, ఆదిలాబాద్‌లో 8, రంగారెడ్డిలో 6, నిజామాబాద్‌ 2, మెదక్‌ ముగ్గురు, విశాఖపట్నంలో 14 మంది, గుంటూరులో 24, తూర్పుగోదావరిలో ఏడుగురు, ప్రకాశంలో అత్యధికంగా 28 మంది, కృష్ణాలో 22 మంది, కడప, అనంతపురం జిల్లాల్లో నలుగురు చొప్పున, పశ్చిమ గోదావరిలో 3, నెల్లూర్‌లో 8, శ్రీకాకుళంలో ఇద్దరు, చిత్తూరు, కర్నూల్‌ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు.
వడదెబ్బ మృతుల కుటుంబాలకు ఆపద్బంధు పథకాన్ని వర్తింప జేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందజేస్తామన్నారు. వడగాలులు, వేసవి తీవ్రతతో రాష్ట్రంలో హెచ్చు సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు వాడగాలుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆస్పత్రుల్లో చేరుతున్న చిన్నారుల విషయంపై ముఖ్యమంత్రి శుక్రవారం ఆరా తీశారు. నీలోఫర్‌, తదితర ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల గురించి.. వారి ఆరోగ్య పరిస్థితి గురించి.. వారికి అందుతున్న చికిత్స గురించి తెలుసుకుని నివేదిక సమర్పించాలని మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి సహానిని ఆదేశించారు.
రాష్ట్రంలో ప్రధానంగా తెలంగాణాలో నిత్యం రికార్డవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలను బహిరంగ పర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఆరోపించారు. టీ జేఏసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా కూడా కనీసం చీమ కుట్టినట్లుగా కూడా భావించడంలేదన్నారు. ఎండల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలుగాని, ఆస్పత్రుల్లో వైద్యం చేసేందుకు మందులు కూడా అందుబాటులో ఉంచక పోవడం శోచనీయమన్నారు. రోజు పాతికమంది ప్రాణాలు కోల్పో తున్నా జాతీయవిపత్తుల నివారణ కమిటీి కనీసం స్పందించకపోవడం దారుణంగా ఉందన్నారు. పేరుకే జాతీయ కమిటీకి నగరానికి చెందిన మర్రిశశిధర్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. స్థానికంగా జరుగుతున్న పరిణామాలను చూసిస్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉన్నా, తనకేం బాధ్యతన్నట్లు వ్యవహరిస్తున్నాడని ఆయనపై ధ్వజమెత్తారు. ఎండలను కూడా ప్రకృతి వైరీత్యంగానే భావించాలన్నారు. అందుకు అనుగుణంగానే కార్యక్రమాలు, సహాయక చర్యలు చేపట్టాలన్నారు. నిప్పుల కొలిమిగా ఉంటున్న సింగరేణి ప్రాంతంలో కార్మికులు విధులు నిర్వహించడం గగనంగా మారుతున్నందున యాజమాన్యం ప్రభుత్వం సెలవులు ప్రకటించి ప్రాణాలుపోకుండా కాపాడాలని కోదండరామ్‌ కోరారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని, ఆసుపత్రుల్లో వైద్యం అందించేందుకు అన్నింటిని సమకూర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు.