వడ్డీరేటు తగ్గింది

ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించిన ఆర్బీఐ
ముంబై, మే 3 (జనంసాక్షి):కేంద్ర బ్యాంకు మరోసారి పారిశ్రామిక వర్గాలను తీవ్ర నిరాశలోకి నెట్టింది. కీలక వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ, నగదు నిల్వల నిష్పత్తిని యథాతథంగా కొనసాగించడం పారిశ్రామిక, స్టాక్‌ మార్కెట్లను అసంతృప్తికి గురు చేసింది. రిజర్వ్‌ బ్యాంకు శుక్రవారం వార్షిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించింది. రెపో రేటు, రివర్స్‌ రెపో రేటును పావు (0.25) శాతం మేర     తగ్గించింది. దీంతో వడ్డీ రేట్లు కాస్త తగ్గనున్నాయి. ఇంటి, వాహన రుణ గ్రహీతలకు ఇది ఊరట కలిగించేది. రెపో రేటు ప్రస్తుతం 7.25 శాతంగా ఉంది. కేంద్ర బ్యాంకు కీలక వడ్డీ రేట్లను తగ్గించడం గత జనవరి నుంచి ఇది మూడోసారి. 2013-14లో వృద్ధి రేటు 5.7 శాతం ఉంటుందని కేంద్ర బ్యాంక్‌ అంచనా వేసింది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో దశాబ్దంలోనే 5 శాతం కంటే తక్కువగా వృద్ధి రేటు నమోదైందని.. ఈసారి 5.7 శాతంగా నమోదయ్యే అకాశం ఉందని పేర్కొంది. ద్రవ్యోల్బణం 5.5 శాతం ఉంటుందని తెలిపింది. కరెంట్‌ ఖాతా లోటు ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రమాదని ఆందోళన వ్యక్తం చేసింది. నగదు నిల్వల నిష్పత్తిలో ఎలాంటి మార్పులు చేయకపోవడంపై పారిశ్రామిక వర్గాలు అసంతృప్తికి గురయ్యాయి. దీంతో స్టాక్‌మార్కెట్‌ కూడా నష్టాల బాట పట్టింది.ద్రవ్య పరపతి విధానంతోనే వృద్ధి సాధ్యం కాదని ఆర్బీఐ గవర్నర్‌ డి.సుబ్బారావు తెలిపారు. ద్రవ్య సరఫరా నియంత్రణకు ఉన్న అడ్డంకులను తొలగించడంతో పాటు పాలన వ్యవహారాలు, పెట్టుబడులు మెరుగుపరచడం ఎంతైనా అవసరమని పేర్కొన్నారు. ఆర్‌బీఐ చర్యల వల్ల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని, గత మార్చిలో మూడేళ్ల కనష్టానికి చేరిందని తెలిపారు. వచ్చే మార్చి కల్లా 5 శాతానికంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.