వడ్డెర కార్పోరేషన్‌కు 132 కోట్లు

ఏలూరు:,జూలై6(జ‌నం సాక్షి ): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఒడ్డెర్ల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వడ్డెర కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారని వడ్డెర కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవళ్ళ మురళి అన్నారు. ఏలూరు జిల్లా పరిషత్‌ అతిథి గృహంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కార్పొరేషన్‌ ద్వారా రూ.132 కోట్ల రూపాయలు కేటాయించి వీరికి 50 శాతం సబ్సిడీతో రుణాలను పంపిణీ చేస్తున్నట్లు కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవళ్ళ మురళి తెలిపారు. గ్రామాల్లో ఉన్న వడ్డెర సొసైటీలకు రూ.10 లక్షల చొప్పున రుణాలు మంజూరు చేశామని, సొసైటీ ద్వారా కానీ వ్యక్తిగతంగా కాని ఈ రుణాలు అందజేస్తున్నామన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వడ్డెర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వడ్డెర్లకు పూర్తి న్యాయం జరిగిందని అన్నారు. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డిని మా వడ్డెరలు కలిసిఎస్టీ జాబితాలో వడ్డెర చేర్చమని అడిగితే నోరు మెదపలేదని విమర్శించారు. ఆదరణ 2 పథకం ద్వారా వడ్డెర్లకు చేతి వృత్తిదారులకు నాణ్యమైన పనిముట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్టాల్రకు వలసలు వెళుతున్న చేతి వృత్తిదారులకు ప్రమాదం జరిగితే వీరికి

చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బీసీలకు చంద్రన్న పెళ్లి కానుక ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు.