వన్యప్రాణుల ఉసురుతీస్తున్న ఎండలు

నీటి గుంతలు ఏర్పాటు చేసినా సరిపోని సరఫరా
ఆదిలాబాద్‌/నిజామాబాద్‌,మే8(జ‌నం సాక్షి): ఎండలు దంచి కొడుతుండడంతో అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులకు నీటి సరఫరా కష్టంగా మారింది. నీటిని అందించడం అధికారులకు తలనొప్పిగా మారింది.గత సంవత్సరం సాసర్‌ పిట్లలో పోసిన నీటికి డబ్బులు రాలేదనే కారణంతో కొందరు అధికారులు నీటి సరఫరా విషయమై నిర్లక్ష్యం చేస్తున్నట్లు సమాచారం. జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ పెరిగితే వన్యప్రాణులకు ఇబ్బందులు ఉండవని పలువురు అంటున్నారు.  అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులకు తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చాలా ప్రాంతాల్లో సాసర్‌ పిట్లు ఏర్పాటు చేసింది. ప్రతి 15 రోజులకు ఒక్కసారి వాటిలో నీటిని నింపాలని ఆదేశాలు జారీ చేసింది. వేసవి ప్రారంభం తర్వాత కొందరు అధికారులు వారి ఏరియాల్లోని సాసర్‌ పిట్లలో నీటిని నింపి ఉన్నతాధికారులు ఫొటోలు పంపించారు. తరువాత ప్రతి 15 రోజులకు ఒకసారి నింపాల్సి ఉండగా, నిధుల కొరత కారణంగా చాలా మంది అధికారులు నీటిని నింపడం లేదని పలువురు అంటున్నారు. అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పెద్ద సాసర్‌ పిట్లలో సుమారు 3 వేల లీటర్ల నీరు పడుతుంది. ఒక్కసారి నింపితే వాస్తవానికి ఆ ప్రాంతంలో నివసించే వన్యప్రాణులకు పదిహేను రోజుల వరకు సరిపోతుంది. కానీ, మేత కోసం వెళ్లే పశువులు, గొర్రెలు, మేకలు మందలుగా వెళ్లడంతో అందులోని నీరు తాగడంతో కొన్ని సందర్భాల్లో మూడు లేదా నాలుగు రోజుల్లోనే అయిపోతున్నాయి.
దీంతో అటవీ ప్రాంతంలోనే నివసించే వన్య ప్రాణులకు నీటికి తిప్పలు తప్పడం లేదు. ప్రతి సాసర్‌ పిట్లలో నిబంధనల ప్రకారం నెలకు రెండు లేదా మూడుసార్లు నీటిని నింపితే వన్యప్రాణుల దాహాన్ని తీర్చే అవకాశం ఉంది. జిల్లాస్థాయి అధికారులు పర్యవేక్షణ కరువైంది. డివిజన్‌, జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు బాధ్యతగా వ్యవహరించడం లేదని అటవీ శాఖ అధికారులే పేర్కొంటున్నారు. దీంతో వేసవి దాహాన్ని భరించలేక అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులు గ్రామాలు, పట్టణ ప్రాంతాలకు వస్తున్నాయి. సరైన నీటి వసతి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాయి. ఎండలకు
ఇరు జిల్లాలో 43 డిగ్రీలకుపైగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వన్య ప్రాణులకు పెను ప్రమాదం పొంచి ఉంది. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న తరుణం లో అటవీ ప్రాంతాల్లో ఉంటున్న వన్యప్రాణులకు తా గునీరు లభించక మృత్యువాత పడే ప్రమాదం ఉంది. అటవీ ప్రాంతాల్లో తాగునీరు లభించక వన్య ప్రాణులు గ్రామాల్లోకి వస్తున్నాయి.

తాజావార్తలు