వయసు అనేది సంఖ్య మాత్రమే

– క్రికెటర్‌ మహేందర్‌ సింగ్‌ ధోని
ముంబయి, మే28( జ‌నం సాక్షి ) : ఈ ఏడాది ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టును చూసిన వారంతా అనుకున్న మాట..’జట్టులో అందరూ 30కి పైబడిన వారే ఉన్నారు. ఈ సీజన్‌లో రాణించగలదా’ అని. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చెన్నై ఐపీఎల్‌ 11వ సీజన్‌ విజేతగా నిలిచింది. సన్‌రైజర్స్‌తో జరిగిన ్గ/నైల్లో చెన్నై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడోసారి ఐపీఎల్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. మ్యాచ్‌ అనంతరం ధోనీ మాట్లాడుతూ..’జట్టులోని ఆటగాళ్ల వయసు గురించి చాలా మంది మాట్లాడుకున్నాడు. వయసు కంటే ముఖ్యమైనది ఫిట్‌నెస్‌. మా జట్టులోని ఆటగాళ్లు ఎంతో ఫిట్‌గా ఉన్నారు. టోర్నీలో విశేషంగా రాణించిన అంబటి రాయుడినే తీసుకోండి. అతడి వయసు 33. నిజానికి వయసు అడ్డంకే కాదు. అదో సంఖ్య మాత్రమే. అది అసలు సమస్యే కాదు. ఏ జట్టు కెప్టెన్‌ను అడిగినా ఇదే చెబుతాడు. సారథికి కావాల్సిందల్లా మైదానంలో ఆటగాళ్లు చురుగ్గా కదలడం. ప్రత్యర్థి జట్టులో భువనేశ్వర్‌ కుమార్‌తో పాటు రషీద్‌ఖాన్‌ మాపై ఒత్తిడి తెచ్చే బౌలర్లు. మధ్య ఓవర్లలో బాగా పరుగులు రాబట్టాలనుకున్నాం. ప్రతి విజయమూ ఎంతో ప్రత్యేకం. అన్నింటిల్లోకల్లా ప్రత్యేకమైంది ఏదో చెప్పాలంటే చెప్పడం కష్టం’ అని ధోనీ అన్నాడు. ధోనీ ట్రోఫీతో కలిసి భార్య సాక్షి, కూతురు జీవాతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రాం ద్వారా పంచుకున్నాడు. ‘మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ముంబయి అంతా పసుపు రంగులోకి మారిపోయింది. షేన్‌ ‘షాకింగ్‌’ వాట్సన్‌ షాకింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. మంచి విజయంతో టోర్నీకి అద్భుత ముగింపు లభించింది. జీవా.. ట్రోఫీ గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. మైదానంలో తనకిష్టమొచ్చినట్లు పరిగెత్తాలని మాత్రమే అనుకుంది’ అని ధోనీ పేర్కొన్నాడు.