వరదలపై సిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సవిూక్ష

జిల్లాల్లో పరిస్థితులపై అధికారులతో ఆరా
అవసరమైన చోట తక్షణ చర్యలకు ఆదేశాలు
లోతట్టు ప్రాంతాలను అప్రమతం చేయాలని దేశాలు
భారీ వర్షాలనేపథ్యంలో పలు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌
గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరదహెచ్చరిక

హైదరాబాద్‌,జూలై11(జనం సాక్షి): రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ అధికారులతో ప్రగతి భవన్‌లో సవిూక్ష నిర్వహించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. గోదావరి, ఉప నదుల్లో వరద పరిస్థితిపై ఆరా తీశారు. అవసరమైన చోట తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. కుంటలు, చెరువులు, డ్యాంలు, రిజర్వాయర్లకు వస్తున్న వరదపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకొని, చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది. ఆసిఫాబాద్‌ కొమరం భీమ్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అత్యంత ఎక్కువగా పడే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, రూరర్‌, జనగామలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పై జిల్లాలలో ఆరంజ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌ నగరంలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు భారీవర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పరివాహకంలో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. శ్రీరాంసాగర్‌ నుంచి భద్రాచలం వరకు నదిలో భారీ ప్రవాహం కొనసాగుతోంది. మహారాష్ట్ర, ఆదిలాబాద్‌ , కరీంనగర్‌ , నిజామాబాద్‌ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు ఉపనదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. శ్రీరాంసాగర్‌కు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టుకు 99వేల 850 క్యూసెక్కుల వరద ప్రవహిస్తుండగా.. 41 వేల క్యూసెక్కులను 9 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులుకాగా.. ప్రస్తుతం 1087 అడుగులుగా ఉంది. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 90.3 టీఎంసీలు కాగా..ప్రస్తుతం 75.78 టీఎంసీలుగా ఉంది.
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. గోదావరిలో 13 లక్షల 6వేల 618
క్యూసెక్కుల వరద ప్రవహిస్తుండగా.. నీటిమట్టం 50.9 అడుగులకు చేరింది. భద్రాచలంలో స్నానఘట్టాల ప్రాంతం నీట మునిగింది. గోదావరి దిగువన ఉన్న ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీచేసిన అధికారులు.. నీటిమట్టం 53 అడుగులకు పెరిగితే.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని పునరావస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.ఎడతెరిపిలేని వర్షాలతో పాల్వంచలోని కిన్నెరసాని జలాశయానికి వరద భారీగా ప్రవహిస్తోంది. 20 వేల క్యూసెక్కుల మేర వరద ప్రవహిస్తుండగా.. 39 వేల క్యూసెక్కుల… 7 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 407 అడుగులుకాగా… ప్రస్తుతం 403.10 అడుగుల మేర నీరు ఉంది. మరోవైపు కిన్నెరసాని పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తున్న వరద అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం వరకు 27 గేట్లను రెండు విూటర్ల మేర ఎత్తి.. 3,44,239 క్యూసెక్కుల నీటిని.. దిగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు పార్వతి బ్యారేజీకి వదిలారు. సరస్వతి బ్యారేజీకి 3లక్షల 55 వేల క్యూసెక్కులు వస్తుండగా.. 50 గేట్లు తెరిచి అంతేస్థాయిలో వదులుతున్నారు. లక్ష్మీబ్యారేజీకి 9లక్షల 96 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 75 గేట్లను ఎత్తి దిగువకు అంతే మొత్తం వదులుతున్నారు.మరో వైపు కృష్ణా పరీవాహకంలోనూ వరద పెరుగుతోంది. ఆలమట్టి జలాశయానికి ఎగువన ఉన్న డ్యాంలన్నీ నిండటానికి చేరువయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో ఆలమట్టి నుంచి దిగువకు భారీ ప్రవాహం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నానికి ఈ జలాశయానికి 75,149 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. తుంగభద్ర జలాశయానికి కూడా 88,287 క్యూసెక్కులు వస్తోంది. 12 గంటల వ్యవధిలో 3.81 టీఎంసీల నీల్వ చేరుతోంది. ఆలమట్టి, తుంగభద్ర జలాశయాల నుంచి ఐదు రోజుల వ్యవధిలో దిగువకు ప్రవాహం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌ లోని హిమాయత్‌ సాగర్‌ నిండుకుండలా మారుతోంది. ఆదివారం ఉదయం నీటిమట్టం 1760.25 అడుగుల్లో ఉండగా.. సాయంత్రానికి 1760.50 అడుగులకు చేరింది. ఆదివారం సాయంత్రం జలమండలి అధికారులు రెండు క్రస్ట్‌గేట్లను అడుగు మేర ఎత్తి వరదను దిగువకు వదిలారు. గండిపేట జలాశయానికి సంబంధించి మూసీ వాగులో మోస్తరు వరద ప్రవాహం పారుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని మధ్య, చిన్న తరహా ప్రాజెక్ట్‌లు నిండుకుండల్లా మారాయి.