వరల్డ్‌కప్‌ భారత జట్టు ప్రకటన

3

15 మంది ఎంపిక

న్యూఢిల్లీ,జనవరి6(జనంసాక్షి) :  త్వరలో జరిగే వన్డే ప్రపంచకప్‌లో  పాల్గొనే భారత క్రికెట్‌ జట్టును ప్రకటించారు. మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. జట్టు వివరాలను బీసీసీఐ మంగళవారం  ప్రకటించింది. భారత జట్టులో తెలుగుతేజం అంబటి రాయుడకు చోటు లభించింది. కాగా గత ప్రపంచ కప్‌ లో భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌ రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ కు మొండిచేయి ఎదురైంది. ఆల్‌ రౌండర్‌ జడేజాను జట్టులోకి తీసుకోవడంతో యువీకి చోటు దక్కలేదు. ఇక మురళీ విజయ్‌, రాబిన్‌ ఊతప్పలకు కూడా స్థానం లభించలేదు.జట్టు ఎంపికపై జరిగిన బీసీసీఐ సమావేశం ముగిసింది. మహేంద్ర సింగ్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ, అజ్యింకా రహానే, శిఖర్‌ ధావన్‌, సురేష్‌ రైనా, అంబటి రాయుడు, ఆర్‌.అశ్విన్‌, అక్షర పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేష్‌ యాదవ్‌, మహ్మద్‌ షవిూలు తుది జాబితాలో ఉన్నారు. రవీంద్ర జడేజా స్టువర్ట్‌ బిన్నీ, రోహిత్‌ శర్మ లను కూడా జట్టుకు ఎంపిక చేశారు. ఉదయం జడేజా ఫిట్‌నెస్‌పై చర్చించారు.  10 రోజుల్లో పూర్తిగా కోలుకుంటాడనే నమ్మకంతో అతనికి జట్టులో స్థానం కల్పించామని బీసీసీఐ సెలక్టర్లు తెలిపారు. అయితే జడేజా కోసం ధోనీ పట్టుబట్టారని సమాచారం. మొత్తానికి ప్రపంచకప్‌ ను మళ్లీ ధోనీ సారథ్యంలో ఢీకొనబోతోంది.