వరుస ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి
హైదరాబాద్‌్, ఆగస్టు 9 (జనంసాక్షి): వరుస ఆందోళనలతో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఫీజు రియంబర్స్‌మెంటు కొనసాగించాలంటూ గురువారం ఉదయం ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి కొనసాగింది. ఫీజు రియంబర్స్‌మెంటు కొనసాగించాలని, మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, సీలింగ్ ఎత్తివేయాలని, సిఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అలాగే సిఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు టిఆర్‌ఎస్ యత్నించింది. ఫీజు రియంబర్స్‌మెంటు కొనసాగించాలంటూ నినాదాలు చేసింది. దీంతో నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఇదిలా ఉండగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సంఘం నాయకులు, రైతులు సచివాలయ ముట్టడికి యత్నించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ లోపలికి వెళ్లేందుకు యత్నించిన వారిని అడ్డుకున్నారు. అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. అదేవిధంగా ఎస్‌సి వర్గీకరణపై టీడీపీ వైఖరిని మార్చుకోవాలంటూ తెలంగాణ మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ ట్రస్టు భవనం వద్ద బైఠాయించారు. తెలంగాణకు అనుకూలమని కేంద్రానికి లేఖ రాయాలని డిమాండు చేశారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలమన్న నిర్ణయాన్ని ఉపసంహరిం చుకోవాలని కోరారు. ఒకటిగా ఉన్న మాల, మాదిగలను విడదీసేందుకు టీడీపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. లోపలికి వెళ్లేందుకు యత్నించారు. ఇలా గురువారం ఉదయం మొదలు సాయంత్రం వరకు ఎక్కడో చోట ఆందోళనలు, ముట్టడికి యత్నాలు, తదితరమైనవి జరుగుతునే ఉన్నాయి. ఈ సందర్భంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు. బస్సులు, ఆటోల్లో ప్రయాణించే వారు కూడా అవస్థలు పడ్డారు. ప్రాధాన్యత ఉన్న ప్రదేశాల వద్ద ముందస్తుగానే పోలీసులు మొహరించి ఉండడంతో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు.