వర్మీకంపోస్టుతో కూరగాయల సాగు
వరంగల్,జనవరి5(జనంసాక్షి): వరంగల్ రూరల్ జిల్లాకు వర్మికంపోస్ట్ యూనిట్లు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. వర్మికంపోస్టు యూనిట్లు కావల్సిన రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యాన పంటల సాగులో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను వాడేందుకు ప్రభుత్వం రాయితీపై వర్మీకంపోస్టు యూనిట్లను మంజూరు చేస్తోంది. ప్రధానంగా ఆకుకూరలు, పండ్లు, కూరగాయల పంటలలో రసాయనాల వాడకం తగ్గించడం ద్వారా ప్రజలకు మేలైన కూరగాయలు అందేలా చేయాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ప్రభుత్వం ఉద్యాన పంటలు సాగులో కంపోస్టు ఎరువుల వాడకాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టింది. ముందుగా ఉద్యాన పంటలు సాగు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన రైతులకు రాయితీపై వర్మికంపోస్టు యూనిట్లను మంజూరు చేస్తున్నట్లు వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల ఉద్యానశాఖ అధికారి తెలిపారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.