వర్షాలకు చెరువుల్లో చేరుతున్న నీరు

ఎగువన వరదలతో ఎస్సారెస్పీకి జలకళ

నిజామాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): ఎస్సారెస్పీ జళకళను సంతరించుకుంది. అలాగే వరుసగా కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటులు నిండాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరదరావడంతో చాలాకాలం తరవాత ప్రాజెక్ట్‌ నీటిమట్టం పెరుగుతోంది. ఈ సీజనులో ఎస్సారెస్పీ రిజర్వాయర్‌లోకి ఇప్పటి వరకు 19.782 టీఎంసీల వరద వచ్చి చేరింది. విస్తారంగా కురుస్తున్న వానలకు జిల్లాలోని చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మంగళ,

బుధవారాల్లో కూడా దీని దీని ప్రభావం ఉండవచ్చని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో ఇకపై విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నవీపేట, బోధన్‌, రెంజల్‌, నందిపేట, మాక్లూర్‌, బాల్కొండ తదితర మండలాల్లో మోస్తరు వర్షాలు కురియడంతో చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ధర్పల్లి, కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌, ఏర్గట్ల, ఆర్మూర్‌, సిరికొండ, భీమ్‌గల్‌ తదితర మండలాల్లో 30 శాతం కంటే ఎక్కువగా లోటు వర్షపాతం ఉంది. రెంజల్‌, నవీపేట మండలాల్లో మాత్రం వర్షాలు సమృద్ధిగా కురిశాయి. సీజన్‌ ప్రారంభం నుంచి కూడా ఈ రెండు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. బోధన్‌ డివిజన్‌లో భారీ వర్షాలు, నిజామాబాద్‌ డివిజన్‌లో సాధారణం, ఆర్మూర్‌ డివిజన్‌లో అతి తక్కువ వర్షాలు పడడం విశేషం. అడపాదడపా వర్షాలే అయినా జిల్లాలో చాలా చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. ఈనెలలో సమృద్ధిగా కురుస్తున్న వర్షాలకు పంటలకు జీవం వచ్చింది. భూగర్భజల మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. భారీగా వచ్చిన ఇన్‌ఫ్లోతో ఈ చెరువులకు సర్‌ప్లస్‌ కింద నిర్ణీత కెపాసిటీకి మించి నీరు చేరింది. దీంతో అలుగులు పోస్తున్నాయి.