వలస పాలనకు ఎదురుతిరిగిన పులి

టిప్పు పేరు వింటేనే గడగడలాడిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ
బ్రిటిషర్లకు ముచ్చెమటలు పట్టించిన ధీరోదాత్తుడు
రాకెట్ల ప్రయోగానికి అంకురార్పణ చేసిన సృజనశీలి
నిఖార్సయిన లౌకికవాది
నేడు టిప్పుసుల్తాన్‌ 214వ వర్ధంతి
మైసూర్‌/హైదరాబాద్‌, మే 3 (జనంసాక్షి) :
సామ్రాజ్య విస్తరణ కాంక్ష.. ప్రపంచ దేశాలన్నింటినీ తమ ఏలుబడిలోకి తెచ్చుకోవాలనే స్వార్థ చింతన.. భూపాలకులు కావాలనే తాపత్రయం.. సకల సంపదను దోచుకోవాలనే అత్యాశ వెరసి ఇంగ్లండ్‌. వివిధ పేర్లతో వ్యాపారం కోసమంటూ ప్రపంచవ్యాప్తంగా దండయా త్రకు దిగిన బ్రిటిషర్లకు ఎదురొడ్డి నిలిచిన ఏకైక భారతీయ రాజు మైసూర్‌ పులి టిప్పూ సుల్తాన్‌. మూడుసార్లు బ్రిటిష్‌ సేనలను ఓడించి ముప్పుతిప్పలు పెట్టాడు. 16 ఏళ్ల నూనూగు   మీసాల ప్రాయంలోనే అశ్విక దళానికి సారథ్యం వహించిన ధీశాలి టిప్పు. శాస్త్రసాంకేతిక రంగాలపై పరిజ్ఞానంతో తొలిసారి రాకెట్ల రూపకల్పన, ప్రయోగం చేసిన సృజనశీలి. ఆయన శ్రీరంగపట్నంలో బ్రిటిషర్లతో నాలుగోసారి జరిగిన యుద్ధంలో నేలకొరిగి నేటికి 214 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పాఠకుల కోసం ఈ ప్రత్యేక కథనం.

మైసూర్‌ రాజు హైదర్‌ అలీ, ఆయన రెండో భార్య ఫక్రున్నీసాల ప్రథమ సంతానం టిప్పూసుల్తాన్‌. ఆయన 1750 నవంబర్‌ 20న కర్ణాటకలోని కోలార్‌ జిల్లా దేహనపల్లిలో జన్మించాడు. దేహనపల్లి బెంగళూర్‌ పట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆయన పూర్తి పేరు సుల్తాన్‌ ఫతే అలీ టిప్పు. టిప్పు తల్లి ఫాతిమా (ఫక్రున్నీసా) కడప కోట గవర్నర్‌ మొయినుద్దీన్‌ కుమార్తె. టిప్పూ సుల్తాన్‌కు యుద్ధవిద్యలు నేర్పేందుకు ఆయన తండ్రి హైదర్‌లీ ప్రెంచ్‌ శిక్షకులను నియమించారు. వారి నేతృత్వంలో టిప్పూ యుద్ధ విన్యాసాలు, గుర్రపు స్వారీ, శాస్త్ర సాంకేతిక విద్యలు అభ్యసించారు. తన 15వ యేటా 1776లో తండ్రితో కలిసి మైసూర్‌ మొదటి యుద్ధంలో పాల్గొన్నాడు. 16వ యేటనే అశ్విక దళానికి సారధ్యం వహించాడు. 1782 లో జరిగిన రెండో మైసూర్‌ యుద్ధంలో తండ్రికి కుడిభుజంగా నిలిచి పోరాడి బ్రిటిష్‌ వారిని ఓడించారు. అదే సంవత్సరంలో తండ్రి మరణించడంతో మైసూర్‌ సామ్రాజ్యానికి రాజుగా సింహాసనాన్ని అధిరోహించారు. అదే ఏడాది మంగళూరు ఒప్పందం చేసుకున్నారు. 1779 వరకు జరిగిన మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధంలో తన వీరత్వాన్ని ప్రదర్శించాడు. 1792లో లోహపు కవచాలు గల రాకెట్లు (తగ్రఖ్‌) టిప్పూ సైనికదళంతో విజయవంతంగా ఉపయోగించాడు. ఆధునిక ఆయుధాలు, తుపాకులు తయారు చేశాడు. బ్రిటిష్‌ పాలకులకు ఎదురొడ్డి పోరాడారు. రాకెట్ల సాయంతో దేశానికి స్వతంత్రం సిద్ధించేందుకు పోరాటాన్ని కొనసాగించారు. టిప్పూ తయారు చేసిన రాకెట్ల గురించి తెలుసుకున్న బ్రిటిష్‌ పాలకులు తర్వాత వీటి సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహన పెంపొందించుకొని రాకెట్‌ రంగంలో తమ ప్రయోగాలను ప్రారంభించారు. టిప్పూసుల్తాన్‌ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు. తన పాలన చిరకాలం గుర్తిండిపోయేలా చేశారు. కొత్త మౌలుడి లునిసోలార్‌ క్యాలెండర్‌ను రూపొందించారు. కొత్త నాణేలు ప్రవేశపెట్టారు. మైసూర్‌ పట్టు పరిశ్రమను స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. టిప్పూ సుల్తాన్‌ పరిపాలించిన సామ్రాజ్యం ‘సల్తనత్‌ ఎ ఖుదాదాద్‌’. ఉత్తరాన కృష్ణానది, తూర్పున తూర్పు కనుమలు, దక్షిణాన అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉండేది. దేశంలో అధిక సంఖ్యాకులైన హిందువుల కోసం ఆయన అనేక ఆలయాలు నిర్మించి మత సామరస్యాన్ని చాటారు. ఫ్రెంచ్‌ దేశస్తుల అభ్యర్థన మేరకు మైసూర్‌లో తొలి చర్చి నిర్మించారు. బహుభాషా కోవిదుడైన టిప్పూ కన్నడ, హిందుస్థాని, పర్షియన్‌, అరబిక్‌, ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌ భాషలు అలవోకగా మాట్లాడేవారు. తన రాజకోట ఆవరణలోనే శ్రీరంగనాథ ఆలయం నిర్మించాడు. శ్రీరంగపట్నంలో వేసవి విడిది చేసే టిప్పూ ప్రజలకు ప్రభుత్వం నుంచి అందిస్తున్న సేవలను స్వయంగా పరిశీలించేవారు. 1799లో బ్రిటిష్‌ పాలకులతో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడి ఓడిపోయారు. శ్రీరంగపట్టణాన్ని పరిరక్షించే క్రమంలో 1799 మే 4న వీర మరణం పొందారు. టిప్పూ కోటలోకి ఉన్న నీటి సరఫరా మార్గం ద్వారా అక్రమంగా చొరబడ్డ బ్రిటిఫ్‌ సైనికులు టిప్పూ సైన్యాన్ని దొంగదెబ్బతీశారు. ఆ యుద్ధంలో టిప్పు సుల్తాన్‌పై పోరాటానికి బ్రిటిషర్లకు సహకరించిన ట్రావెన్‌కోర్‌కు చెందిన నాయర్లు టిప్పూ ఖడ్గాన్ని ఆర్కాట్‌ నవాబ్‌కు బహూకరించారు. అక్కడినుంచి అది లండన్‌కు చేరింది. 2004లో జరిగిన వేలంలో ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌మాల్య వేలంలో టిప్పూ సుల్తాన్‌ ఖడ్గాన్ని కొనుగోలు చేసి భారత్‌కు తీసుకువచ్చాడు. టిప్పూ మరణానంతరం మైసూర్‌ను హస్తగతం చేసుకున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఆయన బంగారు సింహాసనాన్ని ముక్కలు చేసి పంచుకుంది. దాని మధ్యలో ఉన్న వజ్రాన్ని లండన్‌కు తరలించారు. అన్ని మతాలకు సమాన ప్రాతినిథ్యం కల్పిస్తూ నిజమైన లౌకికవాదిగా టిప్పూసుల్తాన్‌ పేరుతెచ్చుకున్నారు. 44 ఏళ్లు మాత్రమే జీవించిన టిప్పూసుల్తాన్‌ కంఠంలో ప్రాణమున్నంత వరకూ తన సామ్రాజ్యాన్ని ఆంగ్లేయుల చేతికి చిక్కనివ్వలేదు. పక్కబల్లెంలాంటి పొరుగు దేశాల సహకారంతో మైసూర్‌ సామ్రాజ్యాన్ని బ్రిటిష్‌ సర్కారు చేజిక్కించుకున్న ఆయన పేరు చెబితేనే వణికిపోయేది అనేది అక్షరాల సత్యం. అర డజను భాషలను అలవోకగా మాట్లాడే టిప్పూ శాస్త్రసాంకేతిక రంగాల పురుభివృద్ధికి ఆనాడే బాటలు వేశారు. ఆ ధీరోదాత్తుడిని ఇప్పటి పౌరసమాజం విస్మరిస్తోంది. ఆయన స్ఫూర్తిని భవిష్యత్‌ తరాలకు అందించలేకపోతుంది. రాజ్యాధికారం అంటే సింహాసనం మాత్రం కాదనే ప్రజాక్షేమమే ధ్యేయమని ముందుకుసాగిన టిప్పూ మార్గం సదా అనుసరణీయం. ఆయన స్ఫూర్తిని గుండెల నిండా నింపుకొని ప్రతి అడుగూ ముందుకువేద్దాం.