వాక్‌స్వాతంత్య్రం సంపూర్ణం కాదు

1

– రాహుల్‌, కేజ్రీవాల్‌, సుబ్రమణ్యంలకు ‘సుప్రీం’ షాక్‌

న్యూఢిల్లీ,మే13(జనంసాక్షి):సుప్రీంకోర్టు శుక్రవారం సంచలనాత్మక తీర్పునిచ్చింది. పరువు నష్టం కలిగించడం నేరమేనని స్పష్టం చేసింది. భారత శిక్షా స్మృతి (ఐపీసీ) లోని సెక్షన్లు 499, 500ల రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి ఈ పిటిషన్లను దాఖలు చేశారు. వీరిపై పెండింగ్‌లో ఉన్న పరువు నష్టం కేసులపై హైకోర్టులో సవాలు చేయడానికి ఎనిమిది వారాల గడువు ఇచ్చింది. లేని పక్షంలో విచారణను ఎదుర్కొనాలని తెలిపింది.తాజా తీర్పు ప్రభావం వాక్‌ స్వాతంత్య్రంపై ప్రతికూలంగా పడబోదని సుప్రీంకోర్టు పేర్కొంది. వాక్‌ స్వాతంత్రం సంపూర్ణమైనది కానీ, స్వతంత్రమైనది కానీ కాదని తెలిపింది. రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం వ్యక్తుల పరువు ప్రతిష్ఠలకు రక్షణ ఉందని, ఇతరుల పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించే స్వేచ్ఛ ఉన్నట్లు వాక్‌ స్వాతంత్య్రం చెబుతున్నట్లు అర్థం చేసుకోకూడదని వివరించింది. పరువునష్టం జరిగినట్లు వచ్చే ప్రైవేటు ఫిర్యాదులపై సమన్లు జారీ చేసేటపుడు చాలా జాగ్రత్తలు పాటించాలని దేశవ్యాప్తంగా మేజిస్ట్రేట్లకు ఆదేశాలు ఇచ్చినట్లు సుప్రీంకోర్టు తెలిపింది.