వానలు తగ్గుముఖంతో నష్ట నివారణలో రైతులు
పంటచేల్లో నీటిని తొలగించే పనిలో అన్నదాతలు
భూపాలపల్లి,జూలై18జనంసాక్షి(): రాష్ట్రంలో వానలు తగ్గుముఖం పట్టడంతో.. నీట మునిగిన తమ పంటల నష్ట నివారణకు రైతన్నలు సిద్ధమయ్యారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని పంటచేల నుంచి నీటిని తొలగించే పనిలో బిజీ అయ్యారు. పత్తి, సొయా, మొక్కజొన్న ఎక్కువ రోజులు మునక వేయడం వల్ల
మొలకలు మురిగిపోతున్నాయి. లేత మొలకలు, నెల రోజుల దశలో ఉన్న పంటలన్నీ అధిక తేమకు తట్టుకోలేక దెబ్బతింటున్నాయి. దెబ్బతిన్న పెసర్లు, మినుములు, సొయా వంటి పంటలు కోలుకోవడం కష్టమే. అధిక వర్షాలు, వరదలతో దెబ్బతిన్న లక్షల ఎకరాల పంటల్లో చాలా వరకు సాధారణ స్థితికి రావని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో సాగైన పంటలు నెలలోపువే కావడంతో వాటికి తీవ్రనష్టం వాటిల్లుతోంది. బాగా దెబ్బతిన పంటలను తిరిగి దున్ని.. మళ్లీ విత్తనాలను వేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ సీజన్‌లో సాధారణ పంటల్లో పత్తి, మక్కలు మాత్రమే మళ్లీ వేసుకునే అవకాశం ఉందంటున్నారు. పెసర్లు, మినుములు, సొయా పంటలు దెబ్బతింటే, వాటిని పూర్తిగా తొలగించాలంటున్నారు. వాటి స్థానంలో జొన్నలు, సజ్జలు, ఇతర మిల్లెట్స్, నూనె గింజలను పండిరచే అవకాశం ఉందని చెబుతున్నారు.