వాన్‌పిక్ భూముల రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
హైదరాబాద్, జూన్ 12 (జనంసాక్షి):
వివాదాస్పద జీఓల రద్దుకు గల అవకాశాలను ప్రభుత్వం పరి శీలిస్తోంది. ఇప్పటికే బ్రహ్మణీ స్టీల్స్, బయ్యారం గనుల లీజును రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వాన్‌పిక్ భూకేటాయింపులు తదితర జీఓల పై కూడా దృష్టి సారించినట్లు తెలు స్తోంది. మంగళవారంనాడు ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో వీటికి సంబంధించిన అంశాలపై సమీక్షించారు. వాన్‌పిక్ భూకేటా యింపులపై విపక్షాలు ధ్వజమెత్తడం, ఇదే కేసులో మంత్రి వెంకటరమణ అరెస్టు కావడం వంటి పరిణామాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. దీంతో తాజాగా వాన్‌పిక్ ఒప్పందాన్ని కూడా రద్దు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ భూకేటాయింపులను రద్దు చేస్తే ప్రభుత్వానికి గాని, వ్యాపారపరంగా గానీ ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న దానిపై కూడా ముఖ్యమంత్రి న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. గతంలో బ్రహ్మిణీ స్టీల్స్ ఒప్పందాన్ని రద్దు చేసిన ప్రభుత్వం సోమవారం రక్షణ స్టీల్స్ కు చెందిన బయ్యారం గనుల ఒప్పందాలను రద్దు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. వాన్‌పిక్‌కు ఇంత పెద్ద ఎత్తున భూములు కేటాయించడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. ఈ ఒప్పందం పూర్తిగా ఏ ఒక్కరికో లబ్ధి చేకూర్చేలా ఉందని, ప్రజలకు మేలు చేసేలా లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. వాన్‌పిక్ భూకేటాయింపులు ఏ క్షణంలోనైనా రద్దు చేయవచ్చునని తెలుస్తోంది. వాన్‌పిక్‌కు భూములు కేటాయింపుపై ఇప్పటికే మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను సిబిఐ అధికారులు విచారించి అరెస్టు చేశారు. ప్రస్తుతం మోపిదేవి జైలులో ఉన్నారు. కాగా వాన్‌పిక్ భూములు కేటాయించిన కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ కంపెనీలలోకి పెట్టుబడులు వచ్చాయన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మతో పాటు పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు.