వామ్మో మావోయిజం

అంతర్గత భద్రతకు పెనుముప్పు
త్వరలో 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం
ఛత్తీస్‌గఢ్‌లో క్షతగాత్రులను పరామర్శించిన షిండే
చత్తీస్‌గఢ్‌, మే 21 (జనంసాక్షి) :
మావోయిస్టులతో దేశ అంతర్గత భద్రతకు ముప్పు పొంచి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల కాంగ్రెస్‌ నేతలపై సామూహిక హత్యాఖాండకు పాల్పడిన మావోయిస్టుల చర్య అత్యంత అమానవీయమైదని ఆయన అభివర్ణించారు. శుక్రవారం రాయ్‌పూర్‌కు చేరుకున్న ఆయన మావోయిస్టుల దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించారు. మావోయిస్టు దాడి ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మావోయిస్టుల చర్యలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతను మరింత పటిష్టం చేస్తామన్నారు. దాడి ఘటనలో భద్రతా లోపాలు ఉన్నాయో, లేవో అనే విషయం దర్యాప్తులో తేలుతుందన్నారు. ఈ ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోందని అన్నారు. మవోయిస్టుల దాడి ఘటన ఉగ్రవాదం కంటే తీవ్రమైనదిగా ఉందని అన్నారు. ఇదిలా ఉండగా, దాడి జరిగిన సమయంలో కేంద్ర హోంమంత్రి షిండే విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పిసిసి అధ్యక్షుడు నందకుమార్‌ పటేల్‌ కుటుంబాన్ని షిండే పరామర్శించారు. మావోయిస్టులు బాంబు పేలుడుకు పాల్పడిన కాంగ్రెస్‌ నేతలను హతమార్చిన ప్రాంతాన్ని సందర్శించారు.