వారం ఆలస్యంగా రుతుపవనాలు

1
న్యూఢిల్లీ,మే15(జనంసాక్షి):ఈ యేడాది నైరుతి రుతుపవనాలు మరో వారం రోజుల ఆలస్యంగా ప్రవేశించనున్నాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఎల్‌నినో ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఈ యేడాది రుతుపవనాలు పది రోజులు ముందుగానే ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. కానీ, ఐఎండీ మాత్రం వారం రోజులు ఆలస్యంగా భారత్‌లోకి ప్రవేశించి, జూన్‌ 7వ తేదీన కేరళను తాకొచ్చని పేర్కొంది. మరోవైపు.. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరం వద్ద మూడురోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం ఆదివారం రాత్రికి మరింత బలపడే అవకాశాలున్నయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది సోమ, మంగళవారాల్లో వాయుగుండంగా మారొచ్చని భావిస్తున్నారు. దీని ప్రభావంతో తమిళనాడు తీర ప్రాంతాల్లో ఆదివారం నుంచి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి, దక్షిణ కోస్తాలో వర్షాలపై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.