వారసత్వ ఉద్యోగాల కల్పలో విఫలం
ఖమ్మం,ఆగస్ట్7(జనంసాక్షి): సింగరేణిలో వారసత్వం ఉద్యోగాలపై రగడ చెలరేగుతోంది. అధికార, విపక్ష కార్మిక సంఘాల మధ్య మాటల యుద్దంచోటు చేసుకుంటోంది. అధికారక తెబొగకాసం లక్ష్యంగా ఇతర వామపక్ష కార్మిక సంఘాల నేతలు ఇటీవల విమర్శలకు పదను పెట్టారు. కావాలనే ఉద్యోగాలు ఇవ్వడం లేదని, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో గుర్తింపు సంఘం విఫలమైందని వివిధ సంఘాల నేతలు మండి పడుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు సక్రమంగా ఉండివుంటే హైకోర్టు ఎందుకు కొట్టేస్తుందని వాదిస్తున్నారు.
అన్‌ఫిట్ అయిన తమ తండ్రుల ఉద్యోగాలను తమకు ఇవ్వాలన్న నిబంధన గతంలో ఉన్నదే అయినా అమలు చేయడంలో సర్కార్ విఫలం అయ్యిందంటున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం చిత్తశుద్దిగా వ్యవహరించడం లేదని కార్మిక సంఘాల నేతలు అన్నారు. సింగరేణిలో మొదటి డిమాండుగా వారసత్వ ఉద్యోగాలు సాధిస్తామని తెబొగకాసం హావిూ ఇచ్చి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపొందిందన్నారు. గత నాలుగేళ్ల కాలంలో తెబొగకాసం ఇచ్చిన హావిూని నెలబెట్టు కోలేదన్నారు. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లి త్వరగా సమస్య పరిష్కరించాలన్నారు. ఇప్పటికైనా గుర్తింపు సంఘం నాయకులు ఇచ్చిన హావిూ మేరకు ఎన్నికలకు ముందే వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణపై స్పష్టమైన ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. దీనిపై సిఎం కెసిఆర్ గతంలో ఇచ్చిన హావిూపై స్పష్టత ఇవ్వాలన్నారు.