వారసత్వ ఉద్యోగాల సమస్య తీరుస్తాం
ఆదిలాబాద్,జూన్28(జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం వారసత్వ ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నాయని టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ పేర్కొన్నారు. వారసత్వ ఉద్యోగాలను సాధించే విధంగా తాము ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఉద్యోగాలు ఎలా అమలు చేయవచ్చనే అంశంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సింగరేణి సంస్థలో సమ్మె చేయడంతో వారసత్వ ఉద్యోగాలు సాధ్యం కావని తాము ముందే చెప్పామని గతంలోనే గుర్తు చేశారు. కార్మికుల సంక్షేమంపై ఇతర సంఘాలకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని జాతీయ కార్మిక సంఘాలు నడుచుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై సింగరేణి కార్మికులకు అపారమైన నమ్మకం ఉందన్నారు. ఈ కారణంగానే సమ్మెకు కార్మికులు స్పందించలేదని పేర్కొన్నారు. సమ్మె విషయం ఎలా ఉన్నా వారసత్వ ఉద్యోగాల సాధనే ధ్యేయంగా టీబీజీకేఎస్ ముందుకుసాగుతుందన్నారు.