వాషింగ్టన్ వైపు దూసుకొస్తున్న కార్చిచ్చు
వాషింగ్టన్: ఉత్తర అమెరికా దేశాలను కార్చిచ్చు(wildfire) వణికిస్తోంది. బలమైన గాలుల కారణంగా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే హవాయి ద్వీపంలో బీభత్సం సృష్టించిన ఈ కార్చిచ్చు..
ఇప్పుడు అగ్రదేశం అమెరికా(USA) రాజధాని వాషింగ్టన్(Washington) వైపు దూసుకొస్తోంది. దీంతో వెంటనే ఖాళీ చేయాలని పలు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
వాషింగ్టన్(Washington)లోని స్పోకాన్ కౌంటీ సమీపంలో మొదలైన ఈ కార్చిచ్చు కొన్ని గంటల వ్యవధిలోనే 500 నుంచి 3 వేల ఎకరాలకు విస్తరించింది. బలమైన గాలులే అందుకు కారణమయ్యాయని వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ వెల్లడించింది. దీనివల్ల ఇప్పటికే కొన్ని ఇళ్లు కాలిపోయి ఆస్తినష్టం కూడా సంభవించినట్లు తెలిపింది. దాంతో కౌంటీలోని మెడికల్ లేక్ పట్టణ ప్రజలకు లెవెల్ 3 అలర్ట్ జారీ అయింది. వెంటనే ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని దీని అర్థం.ఈ కార్చిచ్చు(wildfire) దూసుకొస్తుండటంతో మెడికల్ లేక్‌లోని ఓ ఆసుపత్రిలో వైద్యులు, రోగులను తరలించేందుకు ప్రభుత్వం నేషనల్ గార్డ్ ట్రూప్స్‌ను రంగంలోకి దింపింది. ఫోర్ లేక్స్ పట్టణానికి కూడా లెవెల్ 3 ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే స్పోకాన్ కౌంటీలోని 13 వేలమంది ప్రజలున్న చెనెయ్ నగరానికి లెవెల్ 2 అలర్ట్ ఇచ్చారు. సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని దీనర్థం. భారీగా నమోదైన ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులు, బలమైన గాలులు అగ్నికీలల వ్యాప్తికి కారణమవుతాయని జాతీయ వాతావరణ విభాగం తెలిపింది.కెనడా(Canada)లో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కార్చిచ్చులు (Worst wildfires) వేలాది మంది ఇతర ప్రాంతాలకు తరలిపోయేట్లు చేస్తున్నాయి. ఈ దేశంలోని నార్త్‌వెస్ట్ టెరిటరీస్‌లో 200పైగా కార్చిచ్చులు రాజుకున్నాయి. నార్త్ వెస్ట్ టెరిటరీస్ రాజధాని ఎల్లోనైఫ్‌లోని 20 వేల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. దాంతో ఆ ప్రాంతం ఘోస్ట్ టౌన్‌గా మారిపోయింది. శుక్రవారం సాయంత్రం నాటికి 48 గంటల్లో 19 వేల మంది నగరాన్ని ఖాళీ చేశారు. కొంతమంది సొంత వాహనాల్లో వెళ్లిపోగా.. ఇంకొందరిని ఎమర్జెన్సీ విమానాల్లో తరలించారు.