విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ
ఒకే రోజు ముగ్గురు మృతి
25 చేరిన మృతుల సంఖ్య
హైదరాబాద్,జనవరి27(జనంసాక్షి): రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. వ్యాధితో మంగళవారం ఒకరోజే ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇప్పటికే వ్యాధి బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 25కు చేరింది. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం ఏదులాబాద్‌లో స్వైన్‌ఫ్లొతో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. గ్రామానికి చెందిన పూల శైలజ వారం రోజుల క్రితం కుటుంబసభ్యులతో కలిసి తిరుపతికి వెళ్లి వచ్చింది. తలనొప్పి, గొంతునొప్పితో బాధపడుతూ రెండు రోజుల క్రితం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేరింది. వైద్య పరీక్షల అనంతరం స్వైన్‌ఫ్లొ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక వార్డుకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున శైలజ మృతి చెందింది.శైలజ మరణంతో రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మృతుల సంఖ్య 25కు చేరింది. దీంతో గాంధీలో వ్యాధి తీవ్రతతో చికిత్స పొందుతున్న వారి బంధువుల్లో ఆందోళన నెలకొంది. ఇకపోతే గాంధీలో ప్రత్యేక చర్యలు తీసుకుని చికిత్స చేస్తున్నారు. తాజా సమాచారం మేరకు స్వైన్‌ఫ్లూ బాధితుల జాబితాలో ఐదుగురు వైద్యులు చేరారు. జనవరి నెలలో 1050 మందికి పరీక్షలు చేయగా 366 మందికి పాజిటివ్ అని తేలింది, సోమవారం ఒక్కరోజే 52 మందికి పాజిటివ్ అని ఫలితాలు వచ్చాయి. వీరిలో 5 మంది వైద్యులుండటం గమనార్హం. వైరస్ కారణంగా రంగారెడ్డి జిల్లాకి చెందిన ఓ మహిళ మంగళవారం మృతి చెందడంతో జిల్లాలకు కూడా వ్యాధి పాకిందని గుర్తించారు. సీఎంఓ కార్యాలయంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్ల పిల్లలకు కూడా స్వైన్‌ఫ్లూ సోకింది.ఇక మహబూబ్‌నగర్‌లో జిల్లా స్థాయి అధికారికి స్వైన్‌ఫ్లొ సోకినట్లు నిర్థరణ అయింది. స్వైన్‌ఫ్లొ సోకిన అధికారికి వైద్యులు చికిత్స ప్రారంభించారు.