విజృంభిస్తున్న స్వైన్‌ ఫ్లూ

5

నెలరోజుల్లో 30 మరణాలు

హైదరాబాద్‌, జనవరి 31(జనంసాక్షి): నెలరోజులుగా స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. జనవరి నెలలో 1,475 మందికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు బయటపడగా వీరిలో 523 మందికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఉస్మానియా, గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రుల్లో 80 మంది స్వైన్‌ఫ్లూ బాధితులకు ప్రత్యేక చికిత్స ఇస్తున్నారు. స్వైన్‌ఫ్లూ కారణంగా ఇప్పటి వరకు 30 మంది మృతి చెందారు. ఓ వైపు ఆస్పత్రులకు రోగుల తాకిడీ పెరుగుతుండటం.. మరోవైపు ఆస్పత్రుల్లో వసతుల లేమి ఉండటంతో చికిత్సకు తీవ్రంగా ఆటంకంగా పరిణమించింది. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఇప్పటివరకూ 63 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవగా.. వారిలో 34 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణయ్యింది. మరో 29 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు తేలింది. స్వైన్‌ఫ్లూ చికిత్స కోసం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. మరోవైపు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ వ్యాధి ప్రమాద ఘంచికలు మోగిస్తోంది. విశాఖలో ఏడుగురు స్వైన్‌ బారిన పడ్డారు. విశాఖ  జిల్లాలో 7 స్వైన్‌ ఫ్లూ అనుమానిత కేసులు నమోదయ్యాయని, వారిలో ముగ్గురికి ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతంలో సర్వే కోసం 12 వైద్య బృందాలు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 11 కేంద్రాల్లో ¬మియో మందులు పంపిణీకి చర్యలు చేపట్టామని, 14 స్క్రీనింగ్‌ సెంట్లు ఏర్పాటు చేసిన జేసీ పేర్కొన్నారు. పాఠశాలలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.  విశాఖలో 7 స్వైన్‌ఫ్లొ అనుమానిత కేసులు నమోదైనట్లు జాయింట్‌  కలెక్టర్‌ నివాస్‌ తెలిపారు. ముగ్గురికి స్వైన్‌ఫ్లొ ఉన్నట్లు నిర్థరణ అయిందని, ఒకరికి కేజీహెచ్‌లో, ఇద్దరికి ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఇద్దరి నమూనాలు పరీక్షల కోసం హైదరాబాద్‌కు పంపినట్లు వెల్లడించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో స్వైన్‌ఫ్లొ కలకలం రేపింది. స్వైన్‌ఫ్లొతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇంకొల్లుకు చెందిన కోకిల(75) శనివారం ఉదయం మృతి చెందింది. దీంతో ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకూ స్వైన్‌ఫ్లొతో మృతి చెందిన వారి సంఖ్య 3కి చేరింది. స్వైన్‌ఫ్లొ కలకలంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.