విడిపోయి కలిసుందాం

ఇదే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష : కొండా లక్ష్మణ్‌
హైదరాబాద్‌, ఆగస్టు 3, (జనంసాక్షి):
రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు కూడా విడిపోయి కలిసుందామని, అదే అందరికీ లాభ దాయకమని భావిస్తున్నారని ప్రముఖ తెలంగాణ స్వాతంత్య్ర సమర యోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ పునరుద్ఘాటిం చారు. సద్భావనతో విడిపోవాలని స్వాతంత్య్ర సమర యోధులు ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన వస్తున్నదని ఆయన తెలిపారు.తూర్పు గోదావరి జిల్లాకు చెందిన హైదరాబాద్‌ బీహె చ్‌ఈఎల్‌ ఉద్యోగి, రచయిత మురళీకృష్ణ రూపొందించిన ‘విభజన రంగంలో నేనైతే’ ఆడియో సీడీ ఆవిష్కరణ శుక్రవారం అశోక్‌నగర్‌లోని కొండా నివాసంలో జరిగింది. సీడీ ఆవిష్కరణ అనంతరం బాపూజీ మాట్లాడుతూ ఆంధ్రలో వద్దంటున్నా విలీనం చేసిన తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి వాస్తవాలను వెల్లడించి, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ రాష్ట్రాల నిర్మాణానికి ఏ విధంగా కృషి చేయాలో పాటల ద్వారా రచయిత మురళీకృష్ణ అద్భుతంగా వివరించారని కొనియాడారు. తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసి, ఇక్కడి వనరులను కొల్లగొట్టి, తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని, అందుకే విడిపోవాలన్న ఆలోచన వచ్చిందని బాపూజీ సభాముఖంగా స్పష్టం చేశారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాన్చుడు ధోరణిని వీడి తెలంగాణను ఏర్పాటు చేసి, మూడు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన హితవు పలికారు.