విత్తన భాండాగారంగా జిల్లా అనుకూలం

వరివిత్తన కేంద్రాలపై అధ్యయనం

ఖమ్మం,జూలై26(జ‌నంసాక్షి): వరి విత్తన భాండాగారంగా జిల్లా అనుకూలంగా ఉందని జాతీయ వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు గుర్తించారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, పాలేరులో పొలాలు ఇందుకు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. జాతీయ వరి పరిశోధన స్థానం ఐఐఆర్‌ఆర్‌ శాస్త్రవేత్తల బృందం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల పరిశీలన చేసింది. పాలేరు, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, వైరా, మధిర, సత్తుపల్లి డివిజన్‌లోని పలు వరి సాగు గ్రామాలను బృందం సందర్శించింది. వరి సాగులో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం? వెనుకబాటుకు కారణాలు? తదితరాలను గురితంచి పరిశోధనా కేంద్రానికి నివేదించడం ఈ అధ్యయన ఉద్దేశం. అయితే వరి పండించే రైతులు పొలాలకు నీటిని అధికంగా వాడటం వలన భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందని తెలిసింది. శ్రీవరి, లేదా నేరుగా వరి విత్తేపద్ధతి మంచిదని గుర్తించారు. అందువ్ల భూసార పరీక్షలు తప్పనిసరని పేర్కొంది. కూసుమంచి, పాలేరు ప్రాంతాల్లోని భూములు తెలంగాణ వరి విత్తన భాండాగారానికి ఎంతో అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు నివేదిక కూడా అందజేశారు. సత్తుపల్లి డివిజన్‌ల కల్లూరు మండలంలోని పలు ప్రాంతాల్లో వరి పండించే భూముల్లో చౌడు ఉందని గమనించారు. వేంసూరు మండంలోని కందుకూరు భూముల్లో నీటిలో లవణ శాతం ఎక్కువగా ఉండటం వల్ల అక్కడి పొలాల్లో ఎక్కువగా చౌడు ఉంది. చాలా చోట్ల రైతులు మోతాదుకు మించి ఎరువులను వినియోగించారు. ఎరువుల వినియోగం ఎక్కువగా ఉండటంతో నేల భౌతిక స్థితిలో మార్పు వచ్చి చౌడు నేలలు, ఉప్పు నేలలుగా తయారవుతున్నాయి. చీడపీడల ఉద్ధృతి కూడా ఎక్కువవుతోంది.