విద్యారంగాన్ని పటిష్టం చేస్తాం

2

– కేంద్రమంత్రి జవదేకర్‌

హైదరాబాద్‌,ఆగస్టు 13(జనంసాక్షి):దేశంలోని ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే ప్రధాని మోడీ సంకల్పమని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్రం విద్యారంగాన్ని ముందుకు తీసుకెళుతోందన్నారు. పేదలకు విద్యను అందించాలన్న లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.  మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ శనివారం ఉదయం హైదరాబాద్‌ నగరంలోని ముషీరాబాద్‌లో పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. భవిష్యత్తులో విూరు ఏం కాదల్చుకున్నారంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ముషీరాబాద్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో జవదేకర్‌ ముచ్చటించారు. విద్యార్థులతో మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులు రోజూ వ్యాయామం చేయాలి, ఆటలు ఆడాలని చెప్పారు. విద్యాశాతం పెరిగితేనే దేశం అభివృద్ధి బాట పడుతుందని స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్రం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. విద్యార్థులందరూ ఇంగ్లీష్‌ పై పట్టు సాధించాలని పిలుపునిచ్చారు. రోజుకు పదిహేను నిమిషాల పాటు ఆంగ్లంపై దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులతో సరదాగా మాట్లాడిన జవదేకర్‌.. ఏం చదువుతున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? భవిష్యత్‌లో విూరు ఏమి కాదల్చుకున్నారు? కుటుంబ ఆర్థిక పరిస్థితులేంటి? అని అడిగారు. కేంద్రమంత్రి అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు చక్కగా సమాధానమిచ్చారు. మధ్యాహ్నం భోజన వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కేంద్రమంత్రే విూ వద్దకు వచ్చారు. ముషీరాబాద్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు చాలా అదృష్టవంతులని అభినందించారు.  రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. పిల్లల చదువుకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి పదో తరగతి వరకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ముషీరాబాద్‌ నియోజకవర్గానికి జూనియర్‌ కాలేజీని మంజూరు చేస్తామన్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం చేస్తామని కడియం తెలిపారు.బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే లక్ష్మణ్‌తో పాటు హైదరాబాద్‌ కలెక్టర్‌, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.